వాషింగ్టన్ డీసీ: భారతీయ ఎన్నికల వ్యవస్థను అమెరికా ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఓ కామెంట్ చేశారు. భారత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎలా సాగుతుందో.. ఆ రీతిలో ఓటర్ ఫోటో ఐడీ కార్డులను మనం కూడా తీసుకురావాలని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల భారత ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ .. అమెరికా ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారని, ఫోటో ఐడీ లేకుండానే ఎలా అమెరికాలో ఎన్నికలను నిర్వహిస్తున్నారని సీఈవో జ్ఞానేశ్ ప్రశ్నించారని ట్రంప్ పేర్కొన్నారు. ట్రుత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్టు చేశారు. ఆ పోస్టులో ట్రంప్ .. భారతీయ ఎన్నికల ప్రక్రియను మెచ్చుకున్నారు. గత జాతీయ ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటు వేశారాని, దాంట్లో ఒక్క శాతం కన్నా తక్కువ సంఖ్యలో ఓటర్లు మెయిల్ ద్వారా ఓటు వేశారని, ప్రతి సింగిల్ ఓటర్‌కు ప్రత్యేకంగా ఫోటో ఐడీ కార్డు ఉందని, అయితే అదే తరహాలో అమెరికాలోనూ ఓటరు ఫోటో ఐడీలు కావాలని, దీని కోసం రూపొందించిన అమెరికా సేవ్(సేఫ్‌గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబలిటీ) యాక్ట్‌ను ఉభయసభల్లో పాస్ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ తన పోస్టులో వెల్లడించారు.
వైట్‌హౌజ్ దీనిపై స్పందించింది. కేవలం అమెరికా పౌరులు మాత్రమే.. అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఓటు వేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. కేవలం అమెరికా పౌరులు మాత్రమే అమెరికా ఎన్నికలను డిసైడ్ చేయాలని వైట్‌హౌజ్ తన ప్రకటనలో తెలిపింది. అమెరికా సేవ్ యాక్ట్ బిల్లను పాస్ చేయాలని కోరింది. ఫెడరల్ ఎన్నికల వ్యవస్థలో ఓటు వేయడానికి ముందు రిజిస్టర్ చేసుకోవాలని, దీని కోసమే ఈ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నట్లు వైట్హౌజ్త తెలిపింది. అయితే మెయిల్ ద్వార వేసే ఓట్లు విషయంలో ఆంక్షలు పెట్టింది. ఆరోగ్యం క్షీణించినవారు, అంగవైకల్యం ఉన్నవారు, మిలిటరీ సర్వీస్, ప్రయాణంలో ఉన్నవారు మాత్రమే మెయిల్ ఓటుకు అర్హులు అని ప్రతిపాదించారు. పౌరులు కానీ వాళ్లను ఓటింగ్ రోల్స్ నుంచి తీసివేయనున్నట్లు వైట్‌హౌజ్ తెలిపింది. అమెరికాలో మీరు ఓటు వేయాలనుకుంటే, ముందుగా మీరు అమెరికా పౌరుడై ఉండాలని వైట్‌హౌజ్ పేర్కొన్నది. అయితే అమెరికా సేవ్ యాక్ట్ బిల్లును జనవరి 29న అమెరికా చట్టసభల్లో ప్రవేశపెట్టారు.