Mega 158 | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తదుపరి చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అభిమానులు ప్రస్తుతం ‘మెగా158’గా పిలుచుకుంటున్నారు. చిరంజీవి ఇప్పటికే తన పుట్టినరోజు సందర్భంగా ‘మెగా158’కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానుల్లో ఈ అప్డేట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ గ్లింప్స్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఆగస్టు 22న తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ టైటిల్ గ్లింప్స్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు సమాచారం. దీంతో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు థియేటర్లలోనే సెలబ్రేట్ చేసుకునే అవకాశం దక్కనుంది.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఇప్పటికే పలు ఊహాగానాలు ఉన్నాయి. చిరంజీవి స్వయంగా సినిమాలోని టైటిల్లో ‘కదిరి’ అనే పదం ఉంటుందని గతంలో హింట్ ఇవ్వడంతో.. ఇదే సినిమా టైటిల్ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘కదిరి’ పూర్తి టైటిల్లో భాగమా? లేక టైటిల్‌కు సంబంధించిన మరో క్లూనా? అనేది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఆగస్టు 22న విడుదలయ్యే గ్లింప్స్‌తో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. చిరంజీవిని ఈ సినిమాలో మరింత కొత్తగా, స్టైలిష్‌గా చూపించేందుకు బాబీ ప్రత్యేకంగా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఆన్లైన్లో గ్లింప్స్ విడుదల చేయడం కాకుండా థియేటర్లలోనూ ప్రదర్శించనుండటం మెగా అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా మారనుంది. ఇప్పటికే చిరంజీవి బర్త్‌డే కోసం అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ కూడా థియేటర్లలో ప్రదర్శించనున్నారనే వార్తతో సంబరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఆ సంస్థ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండనుందా? చిరు సూచించిన ‘కదిరి’ టైటిల్‌నే ఖరారు చేశారా? అన్న ప్రశ్నలకు ఆగస్టు 22న సమాధానం లభించనుంది.