అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయం.. అవి స్థానిక ఎన్నికలే గానీ బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం నగరంలో వాలిపోయింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ఇలా ఢిల్లీ నుంచి గల్లీ లీడర్ దాకా నగరంలో చక్కర్లు కొట్టి హామీలు గుప్పించారు. అది చేస్తాం.. ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికారు. ఆ హామీల పరిస్థితి ఎలా ఉన్నదంటే.. -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ
హైదరాబాద్ వరద సమయంలో ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం. తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.10 వేలు పొందిన వారికి మిగిలిన రూ.15 వేలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అడుగు ముందుకేసి వరదల్లో బైకు కొట్టుకుపోయిన వారికి బైకు, కారు కొట్టుకుపోయిన వారికి కారు కొనిస్తామని అన్నారు.
బీజేపీ కుటిల నీతి, మతిలేని మాటల్ని గ్రేటర్ జనం ముందే గుర్తించారు. అందుకే గ్రేటర్ పీఠాన్ని ఆ పార్టీకి కాకుండా టీఆర్ఎస్కే అప్పగించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అని కోతలు కోసిన బీజేపీ నేతలు తెలంగాణకు ఈ ఏడున్నరేండ్లలో నయాపైసా ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని కేంద్రం నుంచి తీసుకురాలేదు. కానీ, దేశంలోని 21 రాష్ర్టాలకు రూ.48 వేల కోట్లకు పైగా మొత్తాన్ని కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చింది.
మెట్రోను మరింత విస్తరించడంతో పాటు మెట్రో రెండో దశను తెస్తాం. మెట్రో కారిడార్ నిర్మిస్తాం. మెట్రోలో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తాం.
హైదరాబాద్ మెట్రోకు గత మూడేండ్లుగా రూ.254 కోట్ల వీజీఎఫ్ పెండింగ్ నిధుల్ని విడుదల చేయించలేని ఈ నేతలు.. మెట్రోను విస్తరిస్తాం, ఉద్దరిస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు తప్ప చేసిందేమీ లేదు. గత ఏడాది కేంద్రం దేశంలోని ఆరు నగరాల్లో మెట్రో రెండో దశకు నిధులు కుమ్మరించినా కాషాయ గ్యాంగ్ నోరు విప్పడం లేదు.
కేంద్రం రూ.10 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతుంది. అక్రమ నిర్మాణాల ద్వారా వరదలు రాకుండా చర్యలు తీసుకుంటుంది.
ఒకవైపు ఉత్తర భారతంలోని రాష్ర్టాలకు గంగా మొదలు పలు నదుల ప్రక్షాళన, సుందరీకరణకు భారీ ఎత్తున నిధులను కుమ్మరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మూసీ సుందరీకరణకు నయాపైసా ఇవ్వలేదు. మూసీ సుందరీకరణతో పాటు నాలాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపినా చిల్లిగవ్వ ఇవ్వలేదు.