కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం కేసీఆర్‌పైన కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు పన్నుతున్నది. ఇవన్నీ సీఎం కేసీఆర్ మీద మాత్రమే జరుగుతున్న దాడులని భావిస్తే అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఈ దాడులు మన బతుకులపైనా, మన అభివృద్ధిపైనా అని గ్రహించాలి. తెలంగాణను ప్రగతి బాట పట్టించిన కేసీఆర్‌కు మద్దుతుగా నిలిచి దుష్ట శక్తులపై కలిసి కట్టుగా పోరాడాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిలో కొన్ని ఆయన మానస పుత్రికలు కాగా మరికొన్ని ఒకప్పటి మావోయిస్టుల ఎజెండాను ప్రతిబింబించేవి. నాడు వెట్టి చాకిరి చేయించుకునే భూస్వాముల పైన కరువు దాడులు చేసి పేదలకు బియ్యాన్ని పంచిన నక్సలైట్లను పేదలు దేవుళ్లుగా భావించేవారు. నేడు కేసీఆర్ రాష్ట్ర సంపదను పెంచి పేదలు, మధ్య తరగతి ప్రజలకు వివిధ పథకాల రూపంలో పంచుతున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థను లేకుండా చేశారు. ప్రజలే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించే వెసులుబాటును కల్పించారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మరి గత ప్రభుత్వాలు ఈ పని ఎందుకు చేయలేదు? ఎవరు అడ్డు పడ్డారు? దీని గురించి మనమంతా ఒక్కసారి ఆలోచించాలి.
నాడు పల్లెలంటే చులకన భావం. రైతుల బతుకులు దయనీయంగా ఉండేవి. కానీ నేడు పాడి పంటలతో జనం సంతోషంగా జీవిస్తున్నారు. దశాబ్దాలుగా సాధ్యం కాని అభివృద్ధి ఇప్పుడెలా సాధ్యమైందంటే, మనం సోయికి వచ్చాం. కేసీఆర్ పిలుపునందుకుని ఆయన నాయకత్వంలో సొంత రాష్ర్టాన్ని సాధించుకున్నాం. పాలనా పగ్గాలు ఆయన చేతిలో పెట్టినం. ఆయన పాలనా వ్యవస్థను గాడిలో పెట్టి ఇయ్యాల ప్రతి గడపకు ఏదో ఒక పథకం రూపంలో అభివృద్ధిని అందిస్తున్నారు. నాడు పేదల జీవితాల్లో వెలుగులు నింపే కళ్యాణలక్ష్మి, దళితబంధు లాం టి పథకాలు లేకుండె. వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, దివ్యాంగులకు నాడు, నేడు వస్తున్న పింఛన్లు చూస్తే ఎవరి పాలన బాగుందో అర్థమవుతుంది.
రైతులకు ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న కేసీఆర్ కంటే మించిన రైతు బంధువు ఎవరున్నారు? రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి కొరత తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్. దశాబ్దాల క్రితం వందల రూపాయలకు భూములను అమ్ముకుంటున్నామని రైతులు బాధ పడేవారు, కానీ నేడు తమ భూములకు లక్షల్లో ధర పలకడం చూసి సంతోషపడుతున్నారు. ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైందని మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ అంటే వలసల రాష్ట్రం, కానీ నేడు కేసీఆర్ పాలనలో సుమారు 10, 15 రాష్ర్టాల ప్రజలు వలస వచ్చి బతుకుతున్న రాష్ట్రం. ఏ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని రంగాల సమానాభివృద్ధికి, సుపరిపాలనకు తెలంగాణను చిరునామాగా మార్చడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది.
అభివృద్ధికి సంకేతంలా మారిన తెలంగాణపై నేడు కొందరు కుట్రలు పన్నుతున్నారు. ఈ విషయాన్ని బుద్ధి జీవులైన తెలంగాణ ప్రజలు గ్రహించాలి. బీజేపీ పెద్దల కనుసన్నల్లో ఎమ్మెల్యేలను కొనే కుట్ర, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిన విషయాన్ని ప్రజలంతా ఖండించాలి. రాష్ర్టానికి రావాల్సిన నిధులను రాకుండా చేస్తున్న కుతంత్రాలను గమనించాలి. కేంద్ర పాలకులు రాష్ర్టాన్ని ఆర్థికంగా బలహీనం చేసి మరింత అభివృద్ధి చెందకుండా అష్ట దిగ్భంధనం చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కేసీఆర్ మీద జరుగుతున్నాయని మనం అనుకుంటే అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఎందుకంటే మన రాష్ట్రం మీద, మన ప్రభుత్వం మీద జరిగే కుట్ర మనందరిపైనా జరిగినట్లుగా భావించాలి.
దాన్ని మనకు సంబంధం లేని విషయంగా భావించి పక్కకు జరిగితే మనకు, మన రాష్ర్టానికే నష్టం. కేంద్రం, బీజేపీ చేస్తున్న అన్యాయాలపై సీఎం కేసీఆర్ ఒక్కరే ఎందుకు పోరాడాలి? వారికి బతుకు తెరువు లేకనా? ఈ దుష్ట శక్తుల విషయంలో మనం ఎందుకు మౌన పాత్ర పోషించాలి? అవసరం మనది (ప్రజలది). మన రాష్ట్రం అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. సీఎం కేసీఆర్ చేసే పని అదే అయినప్పుడు ఈ దుష్టశక్తులపై మనం కేసీఆర్‌తో కలిసి పోరాటం చేయాలి కదా? మన రాష్ట్రం మీద దాడులు చేస్తున్న ముఠాను ఎప్పటికప్పుడు దెబ్బతీయడం కేసీఆర్‌తోపాటు మనందరి బాధ్యత కూడా. రాష్ర్టాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర బిడ్డల్లారా… ఇప్పటికైనా మన రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను, కుతంత్రాలను, దాడులను గమనించి అప్రమత్తతతో ఉందాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలిచి మన రాష్ర్టాన్ని ప్రగతి పథంలో పరుగులెత్తిద్దాం. తెలంగాణ పౌరులుగా మన వంతు బాధ్యతను నెరవేరుద్దాం.
జై తెలంగాణ
గోగుల రవీందర్ రెడ్డి
95022 52229