నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ..నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్, బీజేపీ నాయకులు గులాబీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో అమర్ సింగ్ రాథోడ్ (మాజీ జెడ్పీటీసీ), సండ్రు, నవీన్, కుండలి కిశోర్, బక్క నరస గౌడ్, భిక్షపతితో పాటు ఇతర స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి హరీశ్ రావు హైదరాబాద్లోని ఆయన నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అది సబ్కా బక్వాస్
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలు రెండూ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని, ప్రజలను మోసం చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ చెప్పేది సబ్ కా సాత్, సబ్ కా వికాస్ కాదు, వాస్తవానికి అది సబ్కా బక్వాస్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ కేవలం ఉత్తర భారత దేశ పక్షానే ఉంటుంది, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందనీ మండిపడ్డారు. గోదావరి నది తెలంగాణ గుండా పారి ఆంధ్రాలో కలుస్తుంది. కానీ రాబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు రూ.100 కోట్లు ఇచ్చి, 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు.
నార్త్ ఇండియాలో పండే గోధుమలకు ఉండే విలువ తెలంగాణలో పండే వరికి లేదనీ, కేంద్రం గోధుమలకు మద్దతు ధర పెంచి, మన వడ్లకు మాత్రం మొండి చేయి చూపించిందనీ దుయ్యబట్టారు. బీజేపీకి ఓటు వేసినందుకు ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.7000 నష్టపోయారనీ, పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండి ఉంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు నిధులు తెచ్చేవాళ్లమని గుర్తు చేశారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ
నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది బీజేపీ కాదా? బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చూసిన పార్టీ బీజేపీ కాదా అని ప్రశ్నించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పైకి కొట్టుకున్నట్లు నటిస్తారనీ లోపల మాత్రం రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అవినీతి పాలనకు బీజేపీ రక్షణగా నిలుస్తున్నదని గుర్తు చేశారు. కేసీఆర్ కట్టిన బిల్డింగులకు రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప, కొత్తగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, ప్రజలకే బాకీ పడిందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయనీ, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. అబద్ధపు హామీలతో వచ్చిన కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ ఎదుగుదలకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని సూచించారు.