న్యూఢిల్లీ: ఎన్నో ఏండ్ల ఎదురుచూపుల అనంతరం పార్లమెంట్ గడప తొక్కిన మహిళా బిల్లుకు ఆమోదంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకే ఓటింగ్‌ను కోరిన సభ్యులు ఇక దానిని ఆమోదించేందుకు అంత సునాయాసంగా అంగీకరిస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. బిల్లును సొంతంగా గట్టెక్కించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సొంతంగా సభ్యుల బలం లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. రాజ్యాంగ సవరణ అవసరమయ్యే మహిళా బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు తెలపాలి. కానీ అధికార ఎన్డీయే కూటమికి ఉభయ సభల్లోనూ అంత బలం లేదు. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 293 మంది (54%) సభ్యుల మద్దతు ఉండగా, ప్రతిపక్ష కూటమిలో 233 మంది సభ్యులు ఉన్నారు. ఏడుగురు ఎంపీలు స్వతంత్రులు కాగా, మరో ఏడుగురు వైసీపీ, ఎంఐఎం, శిరోమణి అకాలీదళ్‌కు చెందినవారు ఉన్నారు. వీరు ఇంతవరకు బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు బహిరంగంగా ప్రకటించలేదు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు మహిళా బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది ఎంపీలు మద్దతునివ్వాలి. లేదా సమాజ్‌వాదీ (37 మంది ఎంపీలు), తృణమూల్(28 మంది ఎంపీలు) లేదా డీఎంకే (22 మంది ఎంపీలు) వంటి ఏవైనా రెండు విపక్ష పార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా గైర్హాజరు కావాలి. అప్పుడే ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.
వారి ఓట్లు కీలకం..
ఒకవేళ ఈ బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందకపోతే.. వాటిని రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. రాజ్యసభలో ఎన్డీయేకు అనుకూలంగా 141 మంది (58%) సభ్యులు ఉండగా, ప్రతిపక్షానికి 83 మంది ఎంపీల మద్దతు ఉన్నది. బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, ఇండిపెండెంట్లు కలిపి 20 మంది ఉన్నారు. వీరి ఓట్లు బిల్లు ఆమోదానికి కీలకం కానుంది. ఎగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార కూటమికి 163 మంది సభ్యులు (మూడింట రెండు వంతుల మంది) కావాలి. రాజ్యసభలో బీజేపీకి 107 మంది ఎంపీలుండగా, కాంగ్రెస్‌కు 28, టీఎంసీ 13, ఆప్ 10, డీఎంకేకు 8 మంది సభ్యులున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందేందుకు ఉభయ సభల్లో తమకు కావాల్సినంత సభ్యుల మద్దతు లేదని బీజేపీ నేతలు ప్రైవేట్‌గా అంగీకరిస్తున్నారు.
మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం
రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి (50%)కు పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. ఒకవేళ లోక్‌సభలోని 540 మంది సభకు హాజరైతే.. వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లులకు మద్దతు తెలపాలి.