Super Specialty hospital | పాలమూరు సిగలోకి మరో మణిహారం చేరబోతున్నది. సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. పాత కలెక్టరేట్ స్థానంలో రూ.270 కోట్లతో కన్స్ట్రక్షన్ చేపట్టి మరో రూ.50 కోట్లు వైద్య పరికరాలకు ఖర్చు చేయనున్నారు. మొత్తం ఆరు ఫ్లోర్లు, వెయ్యి పడకల స్థాయితో వైద్యశాల నిర్మిస్తున్నారు. విశాలమైన భవంతులు, పార్కింగ్, లాన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మెయిన్ బ్లాక్‌లో పుటింగ్ పనులు పూర్తయ్యాయి. ఏడాదిన్నరలోగా పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నిర్మిస్తున్నారు. పట్టణంలో ఇదే అతిపెద్ద సర్కార్ భవనంగా రికార్డు సృష్టించనున్నది. పెద్ద పెద్ద సర్జరీలు ఇక్కడే జరిగేలా.. భవిష్యత్‌లో అవయవ మార్పిడి చేసేలా వసతులు కల్పించనున్నారు. పనులు పూర్తయితే ఇక్కడ ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందనున్నాయి. అన్ని రకాల చికిత్సలు 24 గంటలపాటు అందుబాటులోకి రానున్నాయి.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన తలమానికంగా మారనున్నది. హైదరాబాద్‌కు దీటుగా కార్పొరేట్ తరహాలో భవన ని ర్మాణం చేపడుతున్నారు. రూ.270 కోట్ల వ్య యంతో ఆరు అంతస్తుల్లో నిర్మిస్తున్న భవనం.. పాలమూరులోనే అత్యంత ఎత్తయినదిగా రికా ర్డు సృష్టించనున్నది. ప్రైవేట్ భవనాలు కూడా ఐదు అంతస్తులకు మించి లేవు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరయ్యాక.. టీచింగ్ దవాఖానకు కలిపి ప్రభుత్వం రూ.450 కోట్లను కే టాయించింది. మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యాక ప్రస్తుతం వైద్య విద్యార్థులు ప్రభుత్వ దవాఖానలోనే టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభమయ్యాక.. పాత కలెక్టరేట్ భవనం వృథాగా ఉంచడం ఎందుకని ఆ స్థలంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూనుకున్నారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 16.8 ఎకరాల్లో విశాలమైన భవంతులు, పార్కింగ్, లాన్లు ఏర్పాటు చేస్తున్నారు. 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో దవాఖాన నిర్మిస్తున్నారు. అన్ని రకాల వైద్య సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉండనున్నాయి. బస్టాండ్, రైల్వేస్టేషన్లకు దగ్గరగా ఉండడంతో జిల్లా కేంద్రానికి సెంటర్ పాయింట్‌గా మారనున్నది. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతుండగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మెయిన్ బ్లాక్‌లో పుటింగ్ పనులు పూర్తయ్యాయి. మరో 15 రోజుల్లో మొదటి అంతస్తు రూప్ లెవల్ వరకు రానున్నది. ఏడాదిన్నరలో భవన నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని టీఎస్ఎంఐడీసీ ఏఈ శరత్ తెలిపారు.
అన్ని రకాల వైద్య సేవలు..
ఏ ఒక్క రోగి కూడా ప్రాణాలు కో ల్పోకూడదు. అలాగని హైదరాబాద్‌కు రెఫర్ చేయొద్దు. అన్ని సౌకర్యాలు స్థానికంగానే ఉండాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టబట్టి సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి నడుం బిగించారు. దవాఖానలో అన్ని రకాల వైద్యసేవలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లు వె చ్చించి ఆధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి హైదరాబాద్‌లోని కార్పొరేట్ దవాఖానకు సరిసమానంగా ఉండే లా తీర్చిదిద్దాలని మంత్రి భావిస్తున్నారు. క్యాజువాలిటీ, పీడియాట్రికల్, ఓబీజీ, గైనకాలజీ, జనరల్ సర్జన్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, ఆర్థ్దోపెడిక్, క్యాన్సర్ ట్రీట్, కార్డియాలజీ, ఓపీడీ స్కిన్, ఓపీడీ డెంటల్, టీబీ, అనెస్తీషియా, ఐసీసీయూ, ఎస్ఐసీయూ, పీఐసీయూ, ఎన్ఐసీయూ, ఎంఆర్డీ, ఆర్ఐసీయూ, ఐసీయూ విభాగాలు, బర్నింగ్, జనరల్ వార్డులు, ఎమర్జెన్సీ, లేబర్బ్లాక్, కిచెన్ బ్లాక్‌లు ఉండనున్నాయి. డయాగ్నోస్టిక్ పరీక్షలు, ఎక్స్‌రే, ఇతర ఖరీదైన టెస్టులన్నీ ఇక్కడే చేయనున్నారు. ఏ చిన్న ఆపద వచ్చినా స్థానికంగా ట్రీట్మెంట్ జరిగేలా అన్ని వసతులు సమకూరుస్తున్నారు. భవిష్యత్‌లో ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరిగేలా వసతులు పెంచుతున్నారు.
క్యాన్సర్‌కు కూడా ట్రీట్మెంట్..
మహబూబ్‌నగర్‌లో ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నాం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండే దవాఖానలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. క్యాన్సర్‌కు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసేలా తీర్చిదిద్దుతున్నాం. పేద ప్రజలకు ఖరీదైన వైద్య సేవలు ప్రభుత్వం తరఫున అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ దవాఖాన నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు.
– డా.వి.శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
టాప్-5లో పాలమూరు మెడికల్ కాలేజీ..
రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. నాలుగేండ్లలోనే టాప్-5లో దూసుకుపోతున్నది. ఏటా నీట్ ఎంట్రెన్స్ తర్వాత అడ్మిషన్లలో మహబూబ్‌నగర్ కళాశాలను టాప్ ర్యాంకర్లు ఎంచుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా టీచింగ్ దవాఖాన కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తున్నారు. 24 గంటలు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం సకల సౌకర్యాలతో దవాఖానలు నిర్మిస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.