మహబూబ్ నగర్ కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి ( Bhu Bharati ) చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి (Collector Vijayendira Boi) తెలిపారు. జూన్ 20 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తారని పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఆధారాలతో రెవెన్యూ సదస్సులలో రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నవాబ్ పేట మండలం కొల్లూరు గ్రామం , దేవరకద్ర మండల కేంద్రంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను బుధవారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని, రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో విచారించి నిర్దేశిత గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు . అనంతరం ఆమె దేవరకద్ర మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు . ఆమె వెంట తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు .