రెబ్బెన జూలై 01 : బెల్లంపల్లి ఏరియాలోని గనులు జూన్ మాసంలో 131 శాతంతో బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూన్ మాసానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసిపికి 2.00 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా 131 శాతంతో 2.62 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. బెల్లంపల్లి ఏరియాకు సింగరేణి సంస్థ నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించడం కోసం సమిష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసిపి ప్రారంభోత్సవం కోసం సింగరేణి యాజమాన్యం తీవ్రమైన కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం స్టేజ్ వన్ అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏరియాలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. దానిలో భాగంగా గోలేటి టౌన్షిప్ కార్మిక కాలనీలో నివాసముంటున్న వారికోసం కొత్తగా నాలుగు బోర్లు ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం రాజమల్లు, డీజిఎం(ఐఈడి ) ఉజ్వల్ కుమార్ బెహరా, పర్సనల్ హెచ్ ఓ డి రాజేశ్వరరావు, సీనియర్ పిఓ ప్రశాంత్ ఉన్నారు.