ఆదిలాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో 1.33 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన సర్కారు.. తాజాగా 80,039 పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు బీసీ స్టడీ సర్కిళ్లు తోడ్పాటునందిస్తున్నాయి. ఈ సర్కిళ్లలో మెరుగైన శిక్షణతో పాటు అన్ని రకాల సౌకర్యాలు, టీ, స్నాక్స్ వంటివి కూడా ప్రభుత్వం సమకూరుస్తున్నది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల నుంచి యూపీఎస్సీ ఉద్యోగాల వరకు నిర్వహించే పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ అందిస్తున్నది. అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటున్న నిరుద్యోగులు వివిధ ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన 197 మంది నిరుద్యోగులు వివిధ కొలువులు సాధించటం విశేషం.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఆదిలాబాద్‌లో బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ వివిధ విభాగాల్లో నిపుణలతో శిక్షణ ఇప్పించడమే కాకుండా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నది. ఏసీ గదులు, మంచినీరు, వాష్‌రూంలు, టీ- స్నాక్స్ వంటి వాటిని అందిస్తున్నది. లైబ్రరీ ఏర్పాటుచేసి యూపీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచింది. శిక్షణ పొందే విద్యార్థులకు రూ.1,500 విలువ చేసే స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేస్తున్నది.
ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌ను రూ.3.75 కోట్లతో నిర్మించి నిరుద్యోగుల శిక్షణకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఇందులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వివిధ ఉద్యోగాలకు గానూ 1,868 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 197 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ఎస్సై, డిప్యూటీ కలెక్టర్‌తో పాటు పోలీస్ కానిస్టేబుల్, బ్యాంక్ క్లర్కులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, జైల్ వార్డెన్, గురుకుల టీచర్లు, టీఆర్టీ, డీఎస్సీ, గ్రూప్-4, ఆర్ఆర్బీ, సింగరేణి, పోస్ట్‌మాన్, ఆర్మీ, ఇతర ఉద్యోగాలు సాధించారు. పది మంది రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సంపాదించారు. వీరితో పాటు 500 మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక్కించుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఉద్యోగాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 3,919 ఉద్యోగాలు వచ్చాయని ఇందులో 25 నుంచి 30 శాతం ఉద్యోగాలు స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు సాధిస్తారని నిర్వాహకులు చెప్తున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన విజయలక్ష్మి చదువంతా ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లోనే సాగింది. కుటుంబ ఆర్థిక అవసరాలకు బీడీలు సైతం చుట్టేవారు. పెండ్లి తర్వాత ఆదిలాబాద్‌లో భర్త సహకారంతో ఎంకామ్, ఎంఏ (ఇంగ్లిష్) పూర్తి చేసింది. పీజీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తన కలను సాకారం చేసుకొనే అవకాశాన్ని వినియోగించుకొన్నారు. 42 ఏండ్ల వయసులో కూడా విజయలక్ష్మి ఆత్మవిశ్వాసంలో ఉద్యోగ సాధనకు ముందుకు సాగారు. 2017లో ఆదిలాబాద్‌లో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకొన్నారు. ప్రభుత్వం వెలువరించిన ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకొని పీజీటీ, ఎస్జీటీ, టీజీటీ, పంచాయతీ కార్యదర్శి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆర్మూర్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా పనిచేస్తున్నారు.