హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వారం రోజుల్లోగా బీసీ సెల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విద్యుత్ సంస్థల అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల సమస్యలపై సెప్టెంబర్లో కోరిన నివేదికలను రెండు నెలలైనా ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
బుధవారం ఖైరతాబాద్కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు విచారణకు హాజరై నివేదికను సమర్పించి వివరణ ఇచ్చారు. నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత విచారణ కొనసాగుతుందని నిరంజన్ తెలిపారు. విద్యుత్ సంస్థల తరపున సమన్వయకర్తలను నియమించాలని సూచించారు. విచారణలో కమిషన్ సభ్యులు జయప్రకాశ్, సురేందర్ పాల్గొన్నారు.