హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 17 శాతానికే పరిమితం చేయడంపై బీసీ, కుల సంఘాలు భగ్గుమన్నాయి. సర్కారు తీరుపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాయి. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టి, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కల్పించిన 23 శాతం కోటా కంటే కుదించిన రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, అవికూడా బీసీ ఉపకులాల వారీగా కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అల్టిమేటం జారీ చేశాయి. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీని పాతరేస్తామని హెచ్చరించాయి. 42 శాతం కోటా హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కి, బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్రకు తెరలేపిందని, దీన్ని ఎంత మాత్రం సహించబోమని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీసీ, కుల, విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి.
జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో నిరాహార దీక్ష చేపట్టారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం బేషరతుగా జీవో 46ను ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ మోసాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఉద్యమాలు, ధర్నాలు, మౌన దీక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసుల వద్ద దీక్షలు నిర్వహించాలని, 29న రహదారుల దిగ్బంధం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్పాలని, బీసీల హకుల సాధన కోసం ప్రజలు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. దీక్షలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, పలు జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో బీసీలకు ఒక సీటు కూడా కేటాయించలేదని లెకలు సహా అధికారికంగా వివరించారు.
ఆర్ కృష్ణయ్య దీక్షకు శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి మద్దతు తెలిపి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీ వ్యతిరేకమని నిప్పులు చెరిగారు. తడిగుడ్డతో గొంతు కోయడం లాంటిదని అభివర్ణించారు. కోటాను సాధించేదాకా విశ్రమించేది లేదని, బీసీ ఉద్యమానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని తేటతెల్లమవుతున్నదని, రేవంత్‌రెడ్డి సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ ఫలాలను బీసీలకు అందించకుండా కాంగ్రెస్ అడుగడుగునా మోసం చేస్తున్నదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేదర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్కుటగుణపాఠం చెప్పాలన్నారు.
రిజర్వేషన్ల కుదింపును నిరసిస్తూ బీసీ విద్యార్థి జేఏసీ, బీసీ జేఏసీ నేతలు బుధవారం గాంధీ భవన్‌ను ముట్టడించారు. ప్రభుత్వం తక్షణం సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయాలని, 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువాలని, లేదంటే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రైవేట్‌గా బీసీ బిల్లు పెట్టించాలని, ఆ బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుదేనని వివరించారు. లేదంటే బీసీలను అవమానించిన కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ముట్టడిలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామిగౌడ్, విక్రమ్‌గౌడ్, కనకాల శ్యామ్ కురుమ, బీసీ జేఏసీ నేత వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.