Bathukamma Sambaralu: సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్కులో బతుకమ్మ వేడుకలను అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు మొదలైన ఈ వేడుకులకు సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, పిల్లలు, పెద్దలు అంతా హాజరై జయప్రదం చేశారు. ఆడపడుచులంతా బతుకమ్మ ఆటలాడి అలరించారు. చిన్నారులు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ, గంతులేస్తూ బతుకమ్మ సంబరాలను ఎంజాయ్ చేశారు. సింగపూర్ వాసులు కూడా ఈ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.
వేడుకల్లో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆహుతులను ఆకర్షించింది. మొదటి మూడు ఉత్తమ బతుకమ్మలకు బహుమతి ప్రధానం జరిగింది. కార్యక్రమ నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అధ్యక్షులు బొమ్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పండుగ విశిష్టతను తెలియజేస్తూ ఈ పండుగ తెలంగాణ గ్రామీణ వికాసాన్ని తెలియచేస్తుందని, ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను నిర్వహించడం ద్వారా విదేశాల్లో కూడా తెలుగువారి ఐక్యతను మరోసారి చాటామని అన్నారు.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కౌ అండ్ ఫార్మర్, సరిగమ రెస్టారెంట్, ఫ్లేవర్స్ రెస్టారెంట్, తందూర్ లాంజ్ రెస్టారెంట్, జానిక్ కంపెనీ ఇన్కార్పోరేషన్స్, జీఐజీ ఇంటర్నేషనల్ స్కూల్, వేలన్ సూపర్ మార్ట్, మెగా గ్రాసరీ మార్ట్ల వారికి నిర్వాహకురాలు కురిచేటి స్వాతి ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు 4 గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 1700 మంది హాజరైనారని, ఆహుతులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశామని, సింగపూర్ తెలుగు సమాజాన్ని అన్ని వేళలా ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగు వారందరికీ కృతజ్ఞతాభినందనలు చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా సుమారు 5000 మంది ఈ బతుకమ్మ వేడుకల ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో లక్కీ విజేతలకు 5 గ్రా౹౹ బంగారం, వివిధ ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. సింగపూర్ తెలుగు వారితోపాటు కమిటీ సభ్యులు, వాలంటీర్స్, స్నేహితులు, వారి కుటుంబాలు ఇలా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం సింగపూర్‌లో ఉన్న వారందరినీ విశేషంగా ఆకర్షించింది.