యాక్ థూ! నీ బతుకు చెడ! నీకిదేం పాడుబుద్దిరా.. కులంలేని పిల్లని పెళ్లిచేసుకొని కులుకుతావా? మన పరువు మర్యాద మంట గలుపుతావా? అసలు నీ కులమేంటో యాదిలో ఉందట్రా నీకు? చస్తే నేనొప్పుకోనుగాక ఒప్పుకోనంతే..” దాదాపు అరుస్తున్నట్టుగా అన్నాడు వీర్రాఘవయ్య.“సచ్చాక నువ్వు ఒప్పుకొనేదేముంది డాడ్! అప్పుడంతా నా ఇష్టమేగా.. అంతదాకా ఎందుకనే చెపుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో కాలం చెల్లిన మీ అభిప్రాయాలకు విలువ లేదు. మనం బాగుండాలంటే రాజీపడక తప్పదు. లేనిపోని పట్టింపులకు పోయి జీవితాన్ని నరకం చేసుకోవడం అవసరమా? ఏ వయసుకాముచ్చట అంటారు. దేనికీ కొదవ లేకున్నా, అవకాశాలన్నీ వదులుకొని వయసులో ఏదీ అనుభవించలేని స్థితి కోరి తెచ్చుకోవడమెందుకు? మనోళ్లలో అమ్మాయిలు దొరకడమే అపురూపంగా ఉంటే.. ఎవరో ఒకరిని చేసుకొని, గుండెల నిండా ప్రేమకు బదులు బాధ నింపుకొని జీవితాంతం భరించాల్సినంత ఖర్మ మనకెందుకు డాడ్. హాయిగా మనసుకు నచ్చినదాన్ని చేసుకుంటే ఆ ఆనందమే వేరుకదా! అయినా ఈ రోజుల్లో మనిషి, మనసు, గుణ, గణాలు ముఖ్యంకానీ.. కుల, మతాలు కాదుకదా! మీరే ఆలోచించండి..” స్థిరంగా అన్నాడు వీరా. ఆలోచనలో పడ్డాడు వీర్రాఘవయ్య. కానీ, అది కొడుకు మాటల గురించి కాదు. కొడుకు తీరు గురించి.
ఈ కాలపు పిల్లలకు పెద్దల మాటలపై ఏమాత్రం గౌరవం లేదు. అయినా నా కొడుకు జీవితానికి అతిముఖ్యమైన ఈ ఒక్క విషయంలోనే మాట వినడం లేదు. ఇప్పుడేమిటి చేయడం? అనే ఆలోచిస్తున్నాడు అతను. కొడుకు గురించి తనెంతగా గర్వంతో విర్రవీగేడు. కొడుకు సుఖ సంతోషాల కోసం తనెంత తపన పడ్డాడు. కానీ, ఇప్పుడెందుకిలా తయారైనట్టు? విదేశీ సంస్కృతి ప్రభావమా..?! అదే అయితే తామే కదా సంపాదన కోసం, సొసైటీలో సోకుల కోసమని అమెరికాకు పంపింది. మరిప్పుడు తప్పెవరిది? పంపిన తనదా? తన ‘ఆశ’యాల మేరకు అక్కడికెళ్లిన తన కొడుకుదా..?.. ఆలోచనలు ఎటూ తెగకపోగా, పుత్రరత్నం చేసిన ఘనకార్యం కళ్లలో మెదిలింది.
గోదావరి, శబరి నదుల పవిత్ర సంగమం. పాపికొండల నడుమ ప్రకృతి సోయగాలతో సూర్యోదయ మవుతోన్న సుప్రభాతవేళ. అందమైన పాపికొండల ఒడిలో ఒదిగివున్న ‘కూనవరం’.. ప్రకృతి ప్రసాదించిన ఓ ‘చిన్న వరం’ అయినా.. ఆ ప్రకృతే ఆడే ఆటలో ఓ పావు. ఆ ఉషోదయపు కాంతిలో ఊరి కామందు ఇంటిముందు ‘ఇల్లు కిరాయికి ఇవ్వబడును’ అన్న బోర్డు చూసి, ఓ క్షణం ఆగిపోయాడు రామప్ప పంతులు. ‘ఓహో ఇట్లాకూడా సంపాదించ బోతున్నారన్నమాట’ అనబోతూ.. అంతలోనే ఖంగు తిన్నాడు, దానికిందనే ‘మా కులపోళ్లకు మాత్రమే’ అని చిన్న అక్షరాలతో, ఇప్పుడొస్తోన్న సిగ్గు, శరం లేని సినిమా పేర్లకింద క్యాప్షన్లాగే రాసి ఉండటం చూశాడు. ‘ఇదేమి పిదప కాలం’ అనుకుంటూ ముక్కుమీద వేలేసుకుని అలాగే నిలబడిపోయాడు. ఎప్పుడొచ్చాడో ఏమో..“ఏమయ్యా పంతులూ! ఆగిపోయావేంటయ్యా! ఏడు గొట్టకముందే పంచె ఎగబట్టుకుని వొచ్చేసావంటే.. ఏదో అచ్చొచ్చే అలయెన్సే అయ్యుండాలే! రావయ్యా.. రా!”.. వాకిట్లో నిలబడి అంటున్న వీర్రాఘవయ్యను చూసి..
‘కొంపదీసి నేను మనుసులోది కూడా పైకి అనలేదుకదా!’ అని తడబడ్డాడు రామప్ప పంతులు. అంతలోనే తేరుకొని..“ఆ ఆఁ.. అవునండీ! మీ అబ్బాయికో సొగసైన సమ్మంధం ఉందండీ. రేపు వాళ్లే వస్తారట.
అది మీ చెవిన వేద్దామని తెల్లారగట్లే తయారై వచ్చేను” అన్నాడు.“ఇదిగో పంతులూ! వచ్చిన ప్రతిసారీ నువ్వొకటి తీసుకు రావడం, మేము దాన్ని తిప్పికొట్టడం ఆనవాయితీ అయిపోయింది. నిప్పులు కడిగిన వంశం మాది. మేమేమిట్లో మీకు తెలియంది గాదు. ముందు కులం ఆ తరవాతే గుణం. మా స్థాయికి కొంచం కూడా తగ్గేది లే! అది యాదిలో ఉంచుకొని ఈ సారన్నా వ్యవహారం పక్కాగా ఫైనల్ చేయండి. ఇక లాంఛనాలు అవీ అంటారా.. ప్రత్యేకంగా చెప్పేదేముంది. కనీసం ఓ ‘కోట’న్నా ఉండాలి..”“ఇంతకీ మీకు ఏ రంగు కావాలండీ! నల్లకోట్లా.. తెల్ల కోట్లా?”ఆ ప్రశ్నకి.. ‘అబ్బో.. మంచి కళా పోసకుడిలాగున్నావే..’ అనుకున్న వీర్రాఘవయ్య..“ఇదిగో పంతులూ! పరాచికాలకేం తక్కువ లేదే! నేను చెప్పేది సూట్లు కాదయ్యా! కోట్లు.. నెట్ క్యాష్.. ఎంతలేదన్నా ఓ కోటి రూపాయలు క్యాష్ ఫ్లో ఉండాలి.. అర్థమైందా..?”“అమ్మమ్మా! ఎంత మాట. నేను చెప్పింది కూడా ఆ కోట్ల క్యాష్ ఫ్లో గురించేనండి..”“మరి రంగులు అడుగుతావేంటయ్యా!?”“అబ్బా.. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండోయ్! అసలు కావాల్సింది రంగే కదా! అదేనండీ.. ‘బ్లాక్ మనీయా, వైట్ మనీనా’ అని అడుగుతున్నా..”
“చంపావు కదయ్యా పంతులు! కూసింతైనా దూరాలోచన ఉంటుందని నేననుకోలేదే..”“భలే వారే! ఆ మాత్రం ఖలేజా లేకపోతే ఈ ఖమ్మం జిల్లాలో, అందులోనూ కూనవరంలో కొలువును ఇంత కమ్మగా ఎలా చేయగలనండి..”“సరి సర్లేగాని.. ఆ అలయెన్స్ కథా కమామీషు ఏంటో వేగిరం వెళ్లి కనుక్కుని చల్లని కబురు చెవిన వేయండి. ఈసారి గోదారి పెరిగి వరదల్లో చిక్కుకోకముందే అన్నీ అయిపోవాలి సుమా. లేటైందనుకో.. అటు వానలొచ్చి వరద పెరిగినా, ఇటు అబ్బాయి అమెరికాకి తిరిగిపోయినా ఏదీ కుదిరి చావదు. ఇప్పటికే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతోంది. వయసు ముదిరిన బెండకాయ చందాన ఆవుతోంది”“ఆ.. ఆఁ ఈ ఈతి బాధలన్నీ మనకు ఏటా ఉండేవే కదండీ! అయినా మీకెన్నో సార్లు చెప్పి చూసాను కదండీ.. మీ వాళ్లలో అమ్మాయిలు దొరకడమే గగనమవుతోందని. ఒకటీ, అరా దొరికినా మీరు ఎందులోనూ రాజీ పడకుండా తిరగ్గొడుతుంటిరాయే. అసలిప్పుడు ‘లగ్నం’ అంటేనే, అందులోనూ మీ వాళ్లంటేనే రాజీపడి పోవాల్సి వస్తోంది. మీ వాళ్లకి సంపాదన మీద మక్కువ ఎక్కువాయె.
మగపిల్లల్ని కంటే మనీ మోసుకొస్తారని డాలర్ల మీద మోజుతో మెరికల్లాంటి కుర్రాళ్లను కని, అమెరికాకి తోలుతుంటే వారికి సరిజోడైన అమ్మాయిల్ని మేమెక్కడ తోడుకొని తేగలమండి..?! కాగడావేసి వెతికినా ఆడపిల్లే కానరాక పోతుంటే.. అందుకేనేమో మీ వాళ్లంతా విసిగి వేసారి పెళ్లయితే చాలని పాశ్చాత్య సంస్కృతి పాలబడిపోయారు. కంటికి నదురుగా ఉన్నోళ్లు ఎక్కడ ఎదురైనా వెంటబెట్టుకొచ్చేసుకొని లగ్గమాడేసు కుంటున్నారు. అంతెందుకు.. మొన్నటికి మొన్న ఆ కరడుగట్టిన అనంతరావు గారే తాతలనాటి సాంప్రదాయాల్ని సైతం తుంగలో తొక్కి తన కొడుక్కి కులం, మతం చూడకుండా కల్యాణం జరిపించేసి, కంటినిండా కమ్మటి నిద్ర పోతున్నాడా..?! అయినా మీకు తెలియందేముంది లెండి. రోజులు మారాయి. మనుషులూ మారిపోతూ ఉన్నారు. ఆ మార్పులు మింగుడుపడని మీలాంటి వారి పంతాలు, పట్టింపుల వల్లే పిల్లల జీవితాలు అడవిగాచిన వెన్నెల అవుతున్నాయి. అలా అడవుల పాలెందుకని పిల్లలే ఆ వెన్నెలని అమెరికాలోనో, ఆఫీసుల్లోనో అలవోకగా కాయించేసుకుంటున్నారు. సమాజం తెచ్చే మార్పులను ఎవరూ ఆపలేరు. కాదననూలేరు. అవి అలా జరిగిపోతూనే ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా అలవరచుకోవాల్సిన అవసరం లేదు. సమాజం దానంతట అదే తనపాటికి తనపని తాను చేసుకుంటూ పోతుంది. దానికి మీరూ, నేనూ ఎవరూ అడ్డంకి కాదు. కాలం, సమాజాలతోపాటే నడిచేవాడెప్పుడూ ఓడిపోడు. ఆనందంగా తన జీవన ప్రయాణాన్ని సాగిస్తాడు. వాటికి వ్యతిరేకంగా నడిచినవాడెవడూ బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అన్నట్టు.. మొన్నీమధ్యే ఆ ఉప్పగండ్లాయన నా ముందే బంగారం లాంటి కొడుకులిద్దరికీ ఏం చెప్పాడో తెలుసాండీ..?”
“హబ్బే.. నాకెట్లా తెలస్తది. అదేదో నువ్వే చెప్పరాదూ..”“ఇద్దరు కొడుకుల్నీ పిలిచి.. ‘ఒరే అబ్బాయిలూ! మీ జీవితం మీ ఇష్టం. అందులో మా ప్రమేయమేమీ ఉండదు. మీ మనసుకు నచ్చిన, మీరు మెచ్చిన వారిని చూసుకొని మనువాడేసుకోండి. మనవాళ్లే కావాలని మడిగట్టుకొని కూర్చుంటే మీకు మరుజన్మలో కూడా మ్యారేజీ కాకపోవచ్చు. ఈ కులాలు మతాలన్నీ మనిషి అవసరాల ముందు బలాదూరే. పిల్లల్ని కూడా మీ కిష్టమైతేనే కనండి లేకపోతే లేదు.. మీ కాలం మీది. మా కాలం మాది. ఎవరిష్టం వారిది. పోలికలొద్దు. కానీ, మన ఆచార సాంప్రదాయాల్ని ఆదమరచిపోకుండా కుటుంబ విలువలను మాత్రం కాపాడుకోండి చాలు’ అని చెప్పేసారండి. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎంచక్కా నచ్చినోళ్లనే పెళ్లిచేసుకొని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వాళ్ల మధ్య కులాల పట్టింపు ఒక్కసారన్నా వస్తే ఒట్టు..” వీర్రాఘవయ్య వినలేనట్టుగా ఆపేస్తూ..
“సరి సర్లేగానీ ఇక ఆపు. ఆ విషయాలన్నీ మనం తీరిగ్గా ఉన్నపుడు మాట్లాడుకుందాం..” అన్నాడు. ఆ మర్నాడే రామప్ప పంతులు అమ్మాయి అమ్మా నాన్నల్ని వెంటబెట్టుకొచ్చేడు. నాన్నేమో చాలా స్మార్ట్‌గా ఉన్నాడు. అమ్మాయమ్మ అంత బాగోలేకపోయినా పొడుగ్గా చక్కగా ఉంది.
‘బ్రైడ్ బాగానే ఉంటుందిలే. నేను ఒకింటివాడయ్యేది ఖాయమేలే’ అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న వీరా.. ‘అమ్మాయికి వాళ్ల నాన్నగారి అందం, అమ్మగారి పర్సనాలిటీ వస్తే బావుండు’ అని కూడా అనుకున్నాడు.
తీరా వెళ్లిచూస్తే, అమ్మాయి మూడున్నర అడుగులకు మించి లేదు. అబ్బాయేమో ఆరడుగులాయె. వీర్రాఘవయ్య ఒక్కడే.. అమ్మాయి తప్ప అన్నీ కుదిరిపోవడంతో ‘చక్కటి’ సంబంధంగా భావించేడు. “ఇదెక్కడి సంబంధం నానోయ్! ముందు-వెనకా, ఎదురు-బొదురుగా, ఐ మూలలుగా ఎటు చూసినా ఫ్లాట్‌గానే ఉంది పిల్ల. ముక్కుందో లేదో తెలీకుండా దానిమీదో కళ్లజోడు తగిలించుకోనుంది. చేసుకునేది సంసారానికా.. చంకన బెట్టుకోడానికా!? నా వల్లకాదు బాబోయ్.. నేను చేసుకోనుగాక చేసుకోను” అంటూ మొండికేసేడు వీరా.ఆ తర్వాత అమెరికా వెళ్లి ఇక ఇట్లా కాదని.. ‘నీ కులం నీకేమైనా కూడు పెడుతోందిరా! అర్థం పర్థంలేని ఆ అనవసర వ్యర్థ కులాలను నమ్ముకొని ఎంతకాలమిలా శీలాన్ని ఎండబెట్టుకుంటావురా! అసలు నీకు కావాల్సింది సుఖసంతోషాలా, కులమతాలా!? ఏది నీ చాయిస్?’ అన్న మిత్రుడి మాటతో, ఆలోచనలో మునిగి తేలి, ఆనక మనసుకు నచ్చిన కొలీగ్‌తో ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. సంవత్సర కాలంగా సహజీవనం సాఫీగానే సాగిస్తూ వస్తున్నాడు. ఇక ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడమే మిగిలి ఉంది. ఇప్పుడు వాళ్ల నాన్నను అడిగితే ‘ససేమిరా’ అంటున్నాడు. అమ్మాయి చూస్తే ఎర్రగా బుర్రగా ఉంది. ఏ ‘తక్కువ కులపు అమ్మాయో’ అయ్యుంటుందనేది వీర్రాఘవయ్య విస్పష్ట విజువలైజేషన్. వీరాని అడిగితే..‘ఆమెకు ఎవరూ లేరు. ఏ కులమో కూడా ఎవరికీ తెలియదట’ అంటున్నాడు. ఇంతలో గోదారి పెరుగుతోందని వార్తలు రావడంతో వీరా ఉన్నపళాన అమెరికా పోయి, తాను కోరుకున్న అమ్మాయినే పెద్దలను ఎదిరించి పెళ్లాడేసాడు. తండ్రీ కొడుకుల పంతాలు, పట్టింపులకు మధ్యలో నలిగిపోయిన వీరా వాళ్లమ్మ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యంతో కన్నుమూయడంతో..అప్పటికే ‘మధుమేహుడైన’ వీర్రాఘవయ్య ఒంటరిగా మిగిలిపోయాడు.
“ఏమే కనకం.. చీటికీమాటికీ పిల్లోడికి పాలివ్వాలని పోతుంటే ఇక్కడ నాకెవరే దిక్కు. ఇకనైనా కాస్త కుదురుగా ఉండి పనులు చేసిపెట్టి పోవే..” అన్నాడు వీర్రాఘవయ్య.. వరదతాకిడి లేని టేకులబోరులో తన బాబును ముసలి తల్లి దగ్గర ఉంచి, పనిచేసి పోయే కనకంతో.
ఒక్కడే కావడంతో చేదోడు వాదోడుగా ఉంటుందని.. కొడుకు పుట్టిన నెలకే యాక్సిడెంట్లో భర్తను కోల్పోయిన కనకాన్ని చేరదీసి పనిమనిషిగా పెట్టుకున్నాడు.“నాకూ ఇబ్బందిగానే ఉంది బాబు గారూ! కానీ ఏం చేయను? పాలివ్వకపోతే ఒంట్లో భారంగా, నలతగా ఉంటోంది. అటు పిల్లవాడూ ఉండలేడు కదా!” అంది దీనంగా.వయసులో ఉన్న కనకం మంచి ఆరోగ్యంతో ఉండటంతో పాలు ఎక్కువగా పడుతున్నాయి. అందుకే మధ్యలో రెండుమూడుసార్లు వెళ్లొస్తుంటుంది. వీర్రాఘవయ్య విసుక్కుంటున్నాడని ఆ రోజు మధ్యాహ్నం తర్వాత అసలు వెళ్లనేలేదు కనకం. జులై నెల కావడంతో సాయంత్రానికే అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. ఎగువన విపరీతంగా వర్షాలు పడటంతో ఒక్కసారిగా వరద పొంగుకొచ్చింది గోదారికి. సంధ్య చీకట్ల ముసురుతోపాటే వర్షం మొదలై గాలివానగా మారింది. వరద పెరిగి ఊరంతా అష్టదిగ్బంధనం అయిపోయింది. తుఫాను గాలులతో ఊరంతా అతలాకుతలమైంది. ఊహించని విధంగా వీర్రాఘవయ్య, కనకంతో సహా ఎక్కడివాళ్లక్కడ చిక్కుకుపోయారు. వీర్రాఘవయ్య రోజూ మాదిరే భోజనానికి ముందుగా వేసుకునే షుగరు మాత్రలు అప్పటికే వేసేసుకున్నాడు. కానీ, వరదభయంతో అన్నీ వదిలేసి మేడపైనున్న గదిలోకి చేరడంతో ఆకలి సంగతే మరచిపోయాడు. కాసేపటికే షుగర్ డౌన్ కావడం ప్రారంభమైంది. మత్తుకమ్మి కళ్లు మూతలుపడిపోతూ, తలంతా దిమ్ముగా ఏమీ తెలియనట్లు అవుతోంది. క్రమక్రమంగా కోమాలోకి జారిపోతున్నాడు. ఆకలికి అలా సొమ్మసిల్లి పోతున్నాడేమో!? అనుకుంటోంది కనకం. అటు బిడ్డ ఎలా ఉన్నాడోనని బెంగ! ఇటుచూస్తే యజమాని ఇలా! ఆ గాలివానలో, చిమ్మ చీకట్లో ఆమెకేం చేయాలో పాలుపోలేదు.
తికష్టమ్మీద దగ్గరికి చేరి..“బాబుగారూ..” అంటూ కదిపి చూసింది. అయినా అతనిలో చలనంలేదు. సరిగ్గా అప్పుడే ఒంట్లో ఎక్కడో ఏదో తెలియని సన్నటి సలుపు మొదలైంది కనకానికి. అతన్ని పట్టుకోవడంలో పాలిండ్లు తగిలి పాలు బయటికి ఉరికేయి. రవికె తడిగా మారింది. దానితో ఆమెకో ఆలోచన మెరిసింది. ఆలస్యం చేయకుండా రవికెను పైకిలాగేసి తన స్తన్యాన్ని అతని నోటికి అందించి గట్టిగాకదుపుతూ.. “తాగండి బాబూ.. పాలు తాగేయండి!” అంటూ అరిచింది.
అతనిలో చలనం లేదు. కానీ, అప్పటికే కారిపోతున్న పాలతో గొంతు తడవటంతో కొద్దిసేప టికి కోలుకున్నాడు వీర్రాఘవయ్య. పోతున్న ప్రాణం తిరిగివచ్చినట్టు అయ్యింది. కానీ, ఏమీ మాట్లాడలేక పోయాడు. ఆ రాత్రి కాళరాత్రి అయింది వారికి. తెల్లారి రెస్క్యూ టీం వచ్చి పడవల్లో టేకులబోరులోని కనకం ఇంట్లోకి చేర్చారు. కానీ, అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ గాలివాన తాకిడికి, చలిదెబ్బకు తట్టుకోలేక ముసలమ్మ పసిగుడ్డును ఒంటరిగా వదిలేసి, మంచం మీదే అశువులు బాసింది. పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. గాలిహోరులో ఆ ఏడుపు ఎవరికీ చేరక అరణ్య రోదనైంది. ఏడ్చి, ఏడ్చి పిల్లాడు సొమ్మసిల్లి పోయాడు. కనకం అదృష్టం బాగుండి చివరిదశలో చూడటంతో.. తల్లిపోయినా కొడుకు బతికి బయటపడ్డాడు. ఆ గాలివాన వెలిసిన తర్వాత ఊరంతా మరో ‘గాలిదుమారం’ రేగింది. అది ‘వీర్రాఘవయ్య-కనకం’ మీదినుంచి.
‘నాయనా వీరా.. కొన్ని నిజాలు నీకు తెలియాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. కూనవరం కోడై కూస్తున్నట్టుగా కనకం నీకు కాదు, నాకు తల్లిస్థానంలో ఉంది. తల్లిని పోగొట్టుకొని, నాకు మరో జన్మనిచ్చిన తల్లి ఆమె. నేనింతకాలం కడుపులో దాచుకొని కాపాడిన కులమాలిన్యాన్ని తన పాలతో కడిగి అభిషేకం చేసిన బంగారు తల్లి. ఆ తల్లికి వరద మిగిల్చిన వ్యథను, గాలివాన చేసిన గాయాన్ని నేను మాన్పగలనా..?! ఏమిచ్చి ఆ తల్లి రుణం తీర్చుకోగలను?! అందుకే.. అభాగ్య తల్లులందరికీ దారిచూపే దీపంగా ఆమెతోనే కూనవరం సొసైటీ ఏర్పాటు చేయించి నా దగ్గరే ఉండమన్నాను.
ఒరే అబ్బాయ్! మనిషన్నవాడికి ఏది ఉన్నా లేకపోయినా ‘కారుణ్యమనే కులం, మానవత్వమనే మతం’ ఉంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు. ఇది అందరూ నాలాగా ఆఖరిదశలోనో, ఆపత్కాలంలోనో కాకుండా ముందుగా తెలుసుకుంటేనే జీవితాన్ని ఆనందంగా గడపగలరు. కుటుంబాన్నీ ఆనందంగా ఉంచగలరు. ఇది తెలియకే నిన్ను బాధించాను. నీవు చేసిన మంచి పనిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. నీ సుఖమే నా సుఖం. నాపై కోపం మాని, సుఖ సంతోషాలతో చిరకాలం వర్ధిల్లు నాయనా..’
లెటర్ చదివిన వీరా సంతోషంతో..‘ఐ యామ్ వెరీ హ్యాపీ డాడ్! నీలో వేళ్లూనుకు పోయిన మహావృక్షాన్ని నేను కూల్చలేకపోయినా, గాలివానతో కూకటి వేళ్లతో సహా కొట్టుకుపోయింది. నీ కోడలు ఎవరో కాదు మనోళ్లమ్మాయే.. అదృష్టం కొద్దీ దొరికింది మనకు. అయినా నీకు తెలీదుగా..’ అనుకున్నాడు.
బట్టేపాటి జైదాస్
తన జీవిత అనుభవాలను హత్తుకునే కథలుగా.. నవ్వించేలా కార్టూన్లుగా మలుస్తున్నారు రచయిత బట్టేపాటి జైదాస్. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిరలో స్థిరపడ్డారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. బాల్యం నుంచే పుస్తకాలను విపరీతంగా చదివేవారు. దాంతో తానెందుకు కథలు రాయకూడదని.. తొమ్మిదో తరగతిలో ఉండగానే కథలు రాసి, బాలజ్యోతికి పంపారు. అవి ప్రచురితం కావడంతో.. రెగ్యులర్‌గా కథలు రాస్తున్నారు. కార్టూనిస్టుగా, నటుడిగా, మైమ్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు. ఉద్యోగ బాధ్యతల వల్ల కొంచెం గ్యాప్ వచ్చినా.. 2004 నుంచి మళ్లీ గేర్ మార్చారు. అన్ని రకాల కథలు రాసినా కామెడీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది ‘తెలుగు కార్టూనిస్ట్‌ల దినోత్సవం’ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా వీరి కార్టూన్లతో ‘జైదాస్ జాయ్ టూన్స్’ అనే బుక్ ఆవిష్కరించారు. తనికెళ్ల భరణి జడ్జిగా వీరి హాస్య కథకు బహుమతి అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో రూ.2వేల బహుమతి పొందిన కథ.
-బట్టేపాటి జైదాస్
94925 78581