న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తమ పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సవరించాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా మార్పులు చేసింది. గరిష్ఠంగా 7 శాతం వార్షిక వడ్డీరేటు లభిస్తుండటం విశేషం. కాగా, ఖాతాలో నగదు నిల్వలనుబట్టి కెనరా బ్యాంక్ వడ్డీరేట్లలో వ్యత్యాసాలున్నాయి. దేశీయ, నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెన్సీ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలన్నింటికీ ఈ మార్పులు వర్తిస్తాయి.
రూ.100 కోట్లదాకా 2.50 శాతం వడ్డీరేటునిస్తున్న కెనరా.. రూ.2,000 కోట్లు ఆపై బ్యాలెన్స్ నిర్వహించే ఖాతాల్లో అత్యధికంగా 4 శాతం వార్షిక వడ్డీనిస్తున్నది. సెప్టెంబర్ 5 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.50 కోట్లదాకా 2.50 శాతం వస్తుంటే.. రూ.3,000 కోట్లు ఆపై నిల్వలకుగాను 6.25 శాతం వడ్డీ ఉన్నది. సెప్టెంబర్ 1 నుంచే వర్తిస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ.3 లక్షలదాకా 2.50 శాతం వార్షిక వడ్డీరేటుండగా.. రూ.25 లక్షలదాకా బ్యాలెన్స్‌లపై గరిష్ఠంగా 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్నది.