కవాడిగూడ, సెప్టెంబర్ 9 : రాష్ట్రం దోపిడీదారుల చేతుల్లో బందీ అయ్యిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. చిన్న సంతకంతో అయ్యేపని చేయకుండా వీఆర్ఏలు రోడ్డుమీదికి వచ్చే పరిస్థితి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఏండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 81, 85 ప్రకారం ప్రస్తుత వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చి దళిత బలహీనవర్గాల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విలేజ్ అసిస్టెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. జేఏసీ గౌరవాధ్యక్షులు వంగూరు రాములు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ పాల్గొని మద్దతు పలికారు.