బుద్ధోదయం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోవడానికి మొహబ్బత్ యాత్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్వేష యాత్ర సాగిస్తున్నారు. చివరకు ఆ పార్టీ నాయకులు పోలీసులను ముందుపెట్టుకొని ఇంటికి డప్పు మోగిస్తూ ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదికి దాడికివెళ్లడం అనేది ఎవరైనా అసహ్యించుకొనే విషయం. ఇదేదో ఘనకార్యంగా చెప్పుకోవడం విడ్డూరం. కానీ అది కాంగ్రెస్‌కు సావు డప్పుగా మారుతుందనే సంగతి రాహుల్ గుర్తించాలి.
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత రాహుల్ గాంధీ యువతను కలవడం గమనిస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా యువత బాట పట్టారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో యువతను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. తెలంగాణలో తమ పార్టీ ముఖ్యమంత్రి విద్వేష రాజకీయాలు నడుపుతుంటే, ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నది. మాకు అవసరమైన నిధులు ఇస్తే చాలు, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ఏమైనా పరవా లేదు అన్నట్టుగా అధినాయకత్వం వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తమ నేతలు, కార్యకర్తలను మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదికి ఉసిగొల్పారు.
ఇదే విధంగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తమ శ్రేణులను రాహుల్ గాంధీ , సోనియా గాంధీ ఇంటి మీదికి ఉసిగొల్పడానికి రేవంత్‌రెడ్డి దారి చూపుతున్నారా? రాహుల్ పుట్టుకపై బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, కాంగ్రెస్ నేతల కంటే ముందే ఖండించారు. ఆనాడు అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ వారికి ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇంటి మీద దాడులు చేయడం పెద్ద కష్టం కాదు కదా! రాజకీయాల్లో ఓ చేదు సంప్రదాయానికి శ్రీకారం చుడితే అది కాంగ్రెస్ మెడకే చుట్టుకుంటుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నది. ఇన్నిరోజుల్లో ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. దీంతో ఇప్పటివరకు బూతులతో కాలం గడిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు రావాలి అంటూ ధర్నాలు చేయిస్తున్నారు. ఇది వింతగా ఉన్నది. గతంలో కేంద్రంలో, రాష్టంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నది అని ధర్నాలు చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు.
ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు, మమతా బెనర్జీ నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధర్నా కాదు కదా పల్లెత్తు మాట కూడా అనలేని దుస్థితిలో ఉన్నారు. తెరవెనుక వ్యవహారాలు ఏమిటో కానీ, తనకు అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో కేంద్రాన్ని ఆయన విమర్శించారు. అంతే తప్ప రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పలేదు. అలాంటి రేవంత్‌రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ ధర్నాకు పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి గతంలో మంత్రిగా కూడా పనిచేయలేదు. పాలనా అనుభవం లేదు, ప్రాజెక్ట్‌ల గురించి అవగాహన లేదు. దీంతో రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకున్నది. కేంద్రం మొండి చేయి చూపుతున్నది. ‘నాకు తగిన పరిజ్ఞానం లేదు. కాబట్టి శాసనసభకు హాజరై సలహాలు ఇవ్వండి’ అని రేవంత్ కోరితే విజ్ఞత చూపినట్టు ఉండేది. కానీ రేవంత్‌కు చావు తెలివితేటలు తప్ప, రాష్ర్టానికి మేలు చేసే ప్రణాళికలు లేవు. రాష్ట్ర ఏర్పాటును మొదటి నుంచీ వ్యతిరేకించిన మీడియా వారి మద్దతు సాధించిన ఆయన రాష్ర్టానికి మేలు చేయాలని ఆలోచించడంలేదు.
కేసీఆర్ శాసనసభకు రావాలంటూ రేవంత్ రెడ్డి ధర్నా చేసింది రాష్ట్రం కోసం కాదు, తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి. కేసీఆర్ శాసనసభకు వస్తే మాటల దాడి చేసి అవమానించాలని. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వాళ్లు చావు డప్పు పేరిట కేసీఆర్ ఇంటి వద్దకు బయల్దేరారు. పోలీసులు వెంట ఉండి మరీ ఈ బృందాన్ని ఎర్రవల్లికి తీసుకువెళ్లారు. ఇదంతా హోంశాఖను కూడా ముఖ్యమంత్రి వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిందా? ఒకవేళ తనకు తెలియకుండా జరిగిందని అంటే ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నమాట.
రాష్ట్రంలో చాలా మందికి సీఎం పేరు తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశాల్లో కూడా వక్తలు ఆయన పేరు తెలియక ఎవరెవరి పేర్లనో చెప్తున్నారు. కేంద్రమంత్రులు కూడా తికమకపడుతున్నారు. ఈ అసంతృప్తి కూడా రేవంత్‌లో ఉన్నది. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అభినందించలేదని రేవంత్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సిల్లీగా ప్రకటించుకున్న సందర్భం లేదు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచి, టీడీపీకి అనుబంధంగా ఉన్న శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అసెంబ్లీ సమావేశంలోనే కేసీఆర్‌ను బూతులు తిడుతూ పోడియానికి తల బాదుకున్నారు. ఎన్ని తిట్టినా కేసీఆర్ ఏమీ అనలేదు. ‘కింద పునాదులు కదులుతుంటే ఇలానే తిడుతారు అని చెప్పి కూర్చున్నారు. అన్నట్టుగానే తెలంగాణలో టీడీపీ పునాదులు పూర్తిగా కదిలిపోయి, తెలంగాణలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఎవరు ఎన్ని తిడుతున్నా ఇప్పుడు కూడా కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. దీంతో అసహనంతో వ్యవహరిస్తున్న సీఎం రేవంత్, కాంగ్రెస్ నాయకులు తమ పార్టీకే చావు డప్పు కొట్టుకుంటున్నారు. ఈ సంగతిని ప్రజలే అర్థం అయ్యేట్టు చెప్తారు.. సమయం వచ్చినప్పుడు.
బుద్దా మురళి