బోనకల్లు: పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలని ఖమ్మం డీఎంఅండ్‌హెచ్‌వో మాలతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పిల్లల దత్తత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు ప్రభుత్వం ద్వారా చట్టపరమైన ప్రక్రియ ద్వారా పిల్లలను దత్తత తీసుకోవాలన్నారు.
దీనివల్ల దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. దీర్ఘకాలిక, హానికరమైన, ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలతో పాటు, మానసిక, శారీరక అంగవైకల్యం, ఆర్థిక స్థిరత్వం లేని వారికి దత్తత ఇవ్వడానికి అవకాశాలు లేవన్నారు. పాపా లేక బాబును దత్తత తీసుకునే రోజున రూ.40 వేలు డీడీను సంబంధిత ఏజెన్సీలకు చెల్లించాలన్నారు.
సెక్షన్-80 ప్రకారం ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా ఈ చట్టంలో చెప్పిన పద్ధతులను అనుసరించకుండా ఏ అనాథ లేక విడిచిపెట్టిన లేదా అప్పగించిన పిల్లలను దత్తత పొందిన, దత్తత ఇచ్చిన సదరు వ్యక్తికి ఆ సంస్థకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలను కొనడం, అమ్మడం వారి ప్రయోజనాల కోసం ఉపయోగించినైట్లెతే 5 సంవత్సరాలు కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలు దత్తత తీసుకునే వారి ధ్రువపత్రాలను తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీడీపీవో శారదాశాంతి, డీసీపీవో విష్ణువందన, డీడీడబ్ల్యూవో ఇన్చార్జి బాలత్రిపురసుందరి, ఏసీడీపీవో కమలప్రియ, ఎంపీడీవో వీ.శ్రీదేవి, వైద్యాధికారులు తాటికొండ శ్రీకాంత్, బాలకృష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, బీజాన్బీ, హెల్త్సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.