ఖిలావరంగల్: చదువుకు తగిన ఉద్యోగం రాలేదని జీవితం మీద విరక్తి చెందిన ఓ ఆటో డ్రైవర్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లో మధ్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం సరస్వతి నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఉడుత శివప్రసాద్(28) తన స్నేహితులకు వచ్చినట్టుగా తాను చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం రాలేదని మానసికంగా కృంగిపోయాడు.
దీంతో జీవితం మీద విరక్తి చెంది కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలోని మైలురాయి 373/2-4 వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జి.సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి తల్లి రాజమణికి అప్పగించినట్లు వారు తెలిపారు. కాగా మృతుడికి భార్య రచన, ఇద్దరు పిల్లలు ఉన్నారు.