సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనంటూ ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల జేఏసీ హెచ్చరించింది. సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, శాతం రమేశ్, ఆంజనేయులు, సలీం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈనెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా నగరంలో పలు ప్రాంతాల్లో సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. సమ్మెను జయప్రదం చేయాలని వాహన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆటోడ్రైవర్ల నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు.