న్యూఢిల్లీ: తన గురితో అంతర్జాతీయ వేదికపై పతకాలు కొల్లగొడుతున్న తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్‌లో మెరుపులు మెరిపిస్తున్న పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఇద్దరిని ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. 2025 సంవత్సరానికి గాను మొత్తం 17 మందిని అర్జునకు ఎంపిక చేసినట్టు క్రీడా శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో గాయత్రితో డబుల్స్ ఆడే కేరళ అమ్మాయి ట్రీసా జాలీ, మహిళల చెస్ ప్రపంచకప్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన దివ్య దేశ్‌ముఖ్,అథ్లెటిక్స్ స్టార్ తేజస్విన్ శంకర్, బాక్సర్ నరేందర్, చెస్ ప్లేయర్ విదిత్ సంతోష్ ఉన్నారు.
నిరుడు 17 మంది పారా అథ్లెట్లు సహా రికార్డు స్థాయిలో 32 మందికి అర్జున ప్రకటించిన కేంద్రం ఈసారి 24 మందిని సెలెక్షన్ కమిటీ సిఫారసు చేసిన ఆరు నెలల తర్వాత 17 మందికి మాత్రమే ఆమోదముద్ర వేసింది. 1991 తర్వాత ఓ ఏడాది క్రీడా పురస్కారాలను ఇంత ఆలస్యంగా ప్రకటిం చడం ఇదే తొలిసారి. పైగా, అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్త్న్ర’ను ప్రభుత్వం ప్రకటించలేదు. బాక్సింగ్ కోచ్ చోటే లాల్ యాదవ్‌తో పాటు పర్వీర్ సింగ్, నేహా చవాన్ ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికయ్యారు.
షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్‌లో గాయత్రి తమదైన ముద్ర వేస్తున్నారు. పుట్టుకతో వచ్చిన వినికిడి, సంభాషణ లోపాన్ని అధిగమించి మరీ ధనుశ్ విశ్వవేదికలపై మెప్పించాడు. డెఫ్లింపిక్స్లో స్వర్ణం గెలిచిన భారత తొలి షూటర్‌గా రికార్డుకెక్కాడు.2021 డెఫ్లింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో చారిత్రక స్వర్ణంతో పాటు మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ పసిడిని కైవసం చేసుకొని ఔరా అనిపించాడు. గతేడాది టోక్యో డెఫ్లింపిక్స్లో ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ 10 మీటర్ల రైఫిల్ పసిడి పతకాన్ని నిలబెట్టుకున్న ధనుశ్ బధిరుల కేటగిరీకే పరిమితం కాకుండా సాధారణ విభాగంలోనూ సత్తా చాటాడు.
2023లో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో సాధారణ షూటర్లతో పోటీపడి స్వర్ణం గెలుచుకున్న తొలి వినికిడి లోపం ఉన్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక, గోపీచంద్ వారసురాలిగా బ్యాడ్మింటన్‌లో అడుగు పెట్టిన గాయత్రి మహిళల డబుల్స్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ట్రీసా జాలీతో కలిసి 2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో రెండు పతకాలు నెగ్గడంతో పాటు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీల్లో రెండుసార్లు విజేతగా నిలిచింది. ఒడిషా ఓపెన్ టైటిల్ కూడా అందుకుంది.