హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : నిషేధిత జాబితా 22-ఏలో భూము లు ఉండి సమస్యలు ఉన్నవారు సంప్రదించేందుకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన 18005994788 నంబర్ టోల్ ఫ్రీ కాదని, అది టోల్ ఫీ నంబర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవాచేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 22-ఏ నిషేధిత జాబితా అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకే కలెక్టర్లు, రెవెన్యూ అధికారు లు 22-ఏ జాబితాను రూపొందించారని చెప్పారు. 22-ఏ వేల లావాదేవీలకు సంబంధించి రికార్డులు అక్రమంగా మారిన అంశం పై ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను కూడా 22-ఏ జాబితాలో చేర్చారని, దీనిపై మంత్రి వివరణ ఇవ్వాలని కోరారు. 22-ఏ నిషేధిత జాబితా పేరుతో 30% కమీషన్లు వసూలు చేసేందుకే వ్యవస్థ ను ఏర్పాటు చేశారని ఆరోపణలు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా మారిందని పేరొన్నారు. మంత్రులు రేవంత్‌రెడ్డిని కాపాడే ప్రయత్నం చేయకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి మాదిరిగా ధైర్యంగా ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి మాటలు విని పేదల కడుపు మీద కొట్టొద్దని హితవుపలికారు.