న్యూఢిల్లీ,: దేశంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులతో కూడిన ఓ భారీ ప్రాజెక్టు అవసరమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మెరుగైన మౌలిక సౌకర్యాలు, రవాణా, ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ నూతన పట్టణ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, అటువంటి ప్రాజెక్టును త్వరలోనే కేంద్రం చేపట్టాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం న్యూఢిల్లీలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ ప్రసంగిస్తూ పీఎం శ్రీ పథకానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై సంతకం చేయని కారణంగా రాష్ర్టాలకు సర్వ శిక్షా అభియాన్నిధులను కేంద్ర నిలిపివేసిందని తెలిపారు. కేంద్ర పన్నులలో రాష్ర్టాల వాటాను 50 శాతానికి పెంచాలని కూడా స్టాలిన్ డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పన్ను ఆదాయంలో రాష్ర్టాల వాటాను 41 శాతానికి కేంద్రం పెంచిందని, కాని రాష్ర్టాలకు కేవలం 33.16 శాతం మాత్రం పంపిణీ చేసిందని ఆయన చెప్పారు.
నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంత అభివృద్ధికి ఓ దీర్ఘకాల అభివృద్ధి దార్శనికత అవసరాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. ఒకప్పుడు నక్సల్ హింసాకాండకు మారుపేరుగా ఉన్న బస్తర్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధిలో దేశానికే మోడల్‌గా మారుతోందని ఆయన తెలిపారు. 2047 నాటికి బస్తర్ నుంచి రూ. 75 లక్షల కోట్ల సంపద సృష్టి జరగడానికి ఆయన ఓ ప్రణాళికను సమావేశంలో వివరించారు. ఆపరేషన్ సిందూర్, ట్రంప్ సుంకాల బాదుడు లాంటి కీలక పరిణామాల తర్వాత జరిగిన కీలకమైన నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశానికి పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. కేరళ సీఎం తరఫున ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బాలగోపాల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్న వేళ బీహార్ సీఎం నితీశ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు నీతి ఆయోగ్‌ని అయోగ్య సంస్థగా అభివర్ణించిన కాంగ్రెస్ నీతి ఆయోగ్ సమావేశాన్ని మరో ప్రహసనంగా, దృష్టి మళ్లింపు కార్యక్రమంగా అభివర్ణించింది.
టీమ్ ఇండియా తరహాలో కేంద్ర ప్రభుత్వం, రాష్ర్టాలు కలసి పనిచేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ అభివృద్ధిని మరింత వేగవంతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. నేటి నీతి ఆయోగ్ గవర్నిరంగ్ కౌన్సిల్ ఇతివృత్తం వికసిత్ రాజ్యం నుంచి వికసిత్ భారత్ 2047 అని, ఇది 140 కోట్ల ప్రజల ఆశయమని ప్రధాని తెలిపారు. సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు సమకూర్చడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి రాష్ట్రం కనీసం ఒక్క పర్యాటక ప్రదేశాన్నయినా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని నగరాల అభివృద్ధికి ప్రగతి, ఆవిష్కరణ, సుస్థిరత చోదక శక్తి కావాలని ఆయన తెలిపారు. కార్మిక శక్తిలో మహిళలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు.