వేదాలకు ఆలవాలమైన భరత వర్షాన్ని సదా రక్షించడానికి ఆదిపరాశక్తి అష్టాదశ శక్తి పీఠాలలో అవతరించింది. ఆ శక్తి కేంద్రాల నుంచి ఉద్భవించే తరంగాలు… భారతావని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలు అని చెబుతారు పెద్దలు. శ్రీలంక నుంచి కశ్మీరం వరకు విస్తరించి ఉన్న ఈ పీఠాలను దర్శించుకోవడం జన్మకో అదృష్టం. అయితే, అది అందరికీ సాధ్యపడే విషయం కాదు! అందుకే, ఆ తల్లి అనుగ్రహం అందరికీ చేరువ చేయడానికి వెలిసిన దివ్య ధామమే అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం. శక్తిపీఠాల్లోని అమ్మవారి రూపాలను ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక కేంద్రం మన తెలంగాణలో సిద్దిపేట సమీపంలోనే ఉంది. పదిహేనేండ్లుగా మానవ సేవలో తరిస్తున్న కొండపాక సమీపంలో ఆనంద నిలయం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమై అలరారుతున్నది. ఆ దివ్యక్షేత్రం విశేషాలివి..
లంకాయాం శాంకరీదేవి కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ చాముండీ క్రౌంచపట్టణే॥
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరికా॥
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే॥
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా॥
వారాణస్యాం విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
శ క్తిపీఠాలు పద్దెనిమిది. వీటిలో పదిహేడు మనదేశంలో ఉండగా… శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. కామాక్షి (కంచి), శృంఖల (కోల్‌కతా), చాముండేశ్వరి (మైసూరు), జోగులాంబ (అలంపూర్), భ్రమరాంబ (శ్రీశైలం), మహాలక్ష్మి (కొల్హాపూర్), ఏకవీర (మాహుర్), మహాకాళి (ఉజ్జయిని), పురుహూతిక (పిఠాపురం), గిరిజ (జాజ్‌పూర్), మాణిక్యాంబ (ద్రాక్షారామం), కామరూపిక (కామాఖ్య), మాధవేశ్వరి (ప్రయాగ), వైష్ణవీదేవి (జమ్మూ), మంగళగౌరి (గయ), విశాలాక్షి (కాశి), సరస్వతీ దేవి (శ్రీనగర్) రూపాలను ఆనంద నిలయం ప్రాంగణంలోని దేవస్థానంలో దర్శించుకోవచ్చు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి ఆనంద చారి టబుల్ ట్రస్టు నేతృత్వంలో చేపట్టిన ఈ ఆలయ సమూహ నిర్మాణం 2023లో పూర్తయింది. దైవ ఘటనతో వెలిసిన శక్తి పీఠాలను దర్శించలేని భక్తులు.. ఈ క్షేత్రానికి వస్తే.. ఒకే తావులో ఆ తల్లి అనంత శక్తిని పద్దెనిమిది రూపాల్లో దర్శించుకునే వీలుంది. ఈ క్షేత్రానికి తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. నిత్యం అమ్మవార్లకు నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే నిత్యాన్నదాన సత్రం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అర్చక స్వాములు శాస్ర్తోక్తంగా నిత్యార్చనలు కొనసాగిస్తుంటారు. పర్వ దినాల సందర్భంగా ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తారు. దేవీ నవరాత్రుల వేళ ప్రత్యేక హోమాలు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం చేసుకునే వీలుంది.
అమ్మవారు సర్వశక్తి ప్రదాయిని. సుఖశాంతులు ప్రసాదించే కల్పవల్లి. భాగవతం, శివ, మత్స్య, పద్మ తదితర పురాణాలలో శక్తి పీఠాల ఆవిర్భావం గురించి సవిస్తరంగా కనిపిస్తుంది. దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవి తండ్రి అవమానించడంతో దేహాన్ని త్యజిస్తుంది. అప్పుడు సతీదేవి పార్థివ దేహాన్ని భుజంపై వేసుకొని శివుడు కరాళ నృత్యం చేస్తాడు. సతీ విరహంతో విలయ తాండవం చేస్తున్న శివుణ్ని నియంత్రించడానికి విష్ణుమూర్తి తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఆ తల్లి శరీర భాగాలు పడిన చోట శక్తి పీఠాలు ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. అలా 108 క్షేత్రాలు వెలిశాయి.
వాటిలో 18 క్షేత్రాలు శక్తి పీఠాలుగా ప్రాచుర్యం పొందాయి. అటువంటి దివ్య క్షేత్రాల అంశలను ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే.. అష్టాదశ శక్తి పీఠాలు చూసిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. అష్టాదశ శక్తి పీఠాలను స్మరించినంత మాత్రాన అనంత ఫలితం దక్కుతుందని ఆర్ష వాక్కు. అటువంటి దివ్యధామాలను ఒక్కచోట నెలకొల్పడం అద్భుతమనే చెప్పాలి. ఇక ఆనందాశ్రమంలో అణువణువులో ప్రశాంతత గోచరిస్తుంది. దూరంగా కొండలు, చుట్టూ చెట్లు, పొలాలు.. పచ్చదనానికి చిరునామాగా కనిపిస్తుంది. ఈ క్షేత్ర సందర్శనంతో లౌకికమైన కోర్కెలు నెరవేరడంతోపాటు అలౌకికమైన ఆనందం కలుగుతుంది.
శక్తిపీఠాల ఆలయానికి కుడిపైపున శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది. అమ్మవారి మందిరానికి ఎదురుగా అరుదైన గోవులతో ఓ గోశాలనూ నిర్వహిస్తున్నారు. మరోపక్క ఆనంద్ నిషాంత్ బాలసదన్ చారిటబుల్ ట్రస్టు, ఆనంద నిలయం వృద్ధాశ్రమం ఉండటంతో ఆ ప్రాంతం భక్తులు, సామాజిక సేవకుల సందర్శనలతో సందడిగా ఉంటుంది. ప్రధానంగా వారాంతాల్లో ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆధ్యాత్మిక శోభలో అలరారుతూనే.. అక్కడ జరుగుతున్న సామాజిక సేవలోనూ ఇతోధికంగా భాగమవుతున్నారు.
హైదరాబాద్- సిద్దిపేట రహదారిలో కుకునూరుపల్లె స్టేజీ నుంచి ఆనందాశ్రమం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వెళ్లేవాళ్లు అక్కడ దిగి ప్రైవేట్ వాహనాల్లో అష్టాదశ శక్తిపీఠ ఆలయానికి చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వెళ్లేవాళ్లు కుకునూరుపల్లె దాటి సుమారు 11 కిలోమీటర్లు నేరుగా వెళ్లాలి. అక్కడ ఎడమవైపు ఆనంద నిలయం బోర్డు కనిపిస్తుంది. ఆ దారి వెంట అర కిలోమీటర్ ప్రయాణిస్తే.. ఆలయానికి చేరుకోవచ్చు.
శాంకరీదేవి
కామాక్షి
శృంఖల
చాముండేశ్వరి
జోగులాంబ
భ్రమరాంబ
మహాలక్ష్మి
ఏకవీర
మహాకాళి
పురుహూతిక
గిరిజ
మాణిక్యాంబ
కామరూపిక
మాధవేశ్వరి
వైష్ణవీదేవి
మంగళగౌరి
విశాలాక్షి
సరస్వతీ దేవి
– కత్తుల శ్రీనివాస్‌రెడ్డి
– బింగి శ్రీనివాస్