మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు. శతాబ్దాలుగా వస్తున్న సదాచారం ఇది. నవరాత్రుల్లో ఆ తల్లి మహాకాళిగా మూడు రోజులు, మహాలక్ష్మిగా మూడు రోజులు, మహాసరస్వతిగా మూడు రోజులు కొలువుదీరి దుష్ట శిక్షణ (రాక్షస సంహారం) చేస్తుంది.
యుద్ధంలో పోరాడుతున్న అమ్మకు తోడుగా మేమున్నామంటూ స్త్రీశక్తికి సంకేతంగా మహిళలంతా చప్పట్లు కొడుతూ, హుషారైన పాటలు పాడుతూ ఉంటారు. అలసిపోయిన అమ్మకు అటుకుల్లో బెల్లం గానీ, చక్కెర గానీ కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ప్రసాదంగా వాటిని అందరూ పంచుకుంటారు. పసుపు, కుంకుమలు ఇస్తూ సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటారు. అలా అటుకుల బతుకమ్మ సందడిలో అందరూ ఆనందంగా పాలుపంచుకుంటారు.
– డా॥ ఆర్.కమల