సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. మహర్షులు బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరిస్తున్నారో ఆ శక్తినే దేవి అన్నాం. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అలాంటి అమ్మవారి మూలతత్వం సూక్ష్మమని, నిర్గుణ రూపమని కూడా మన పురాణాలు చెప్పాయి. ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అవతరించి, నవమి నాడు రాక్షస సంహారం చేసినట్లు నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో ఆది పరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయమైంది. అమ్మ దైవకార్యం కోసం స్థూలరూపం ధరించి, సగుణ స్వరూపంతో లోకానికి వ్యక్తమైనప్పుడు అనేక అవతారాల్లో కనిపిస్తుంది. అందులో తొమ్మిది రూపాలను శరన్నవరాత్రుల సందర్భంగా మనం తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తున్నాం. అయితే ఆది పరాశక్తి సగుణరూపం ప్రధానంగా త్రిగుణాత్మకంగా ఉంటుంది.
తమో గుణ ప్రధానమైనప్పుడు మహాకాళి అనే పేరుతో ఉంటుంది. రజోగుణంలో ఉన్న శక్తి మహాలక్ష్మి, సత్వగుణంతో ప్రకాశించే శక్తి మహా సరస్వతి, సర్వచైతన్య స్వరూపిణిగా వెలుగొందుతుంది. లలిత పేరుతో పూజలందుకుంటుంది. జగదాంబ తొమ్మిది రోజులపాటు శత్రు సంహారం చేసి పదో రోజు విజయోత్సవం చేసుకున్నారు. కాబట్టి దశమిని విజయదశమి అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పూజా విధానం గురించి మన పురాణాలు విస్తారంగా చెప్పాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు దీక్ష స్వీకరించి కలశ స్థాపన, ఆవాహనంతో మొదలు పెట్టి నవమి వరకు అమ్మవారిని అర్చిస్తారు. తొమ్మిది రోజుల్లో వేర్వేరు పేర్లతో పిలవడం మాత్రమే కాదు తొమ్మిది రోజుల్లో జరిగే ఆర్చనలు వేరు, నైవేద్యాలు వేరు. అమ్మవారి అలంకారాలు కూడా వేర్వేరు. చివరకు తత్వాలు కూడా వేరుగా ఉంటాయి.
సాధారణంగా భారతీయులు నిర్వహించుకునే పండగలన్నీ బహుళార్థ సాధకంగా ఉంటాయి. శరత్కాలం… వర్షాకాలానికి, శీతాకాలానికి సంధి సమయం. వర్షాకాలం చివరి దశలో ఆకాశం నిర్మలంగా ప్రకాశిస్తుంటుంది. ఏడాదిలో వసంత, శరతృతువులను యమదంష్ట్రికలుగా పిలుస్తారు. అంటే యముడి కోరలని అర్థం. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే పెనుమార్పులు అనేక వ్యాధులకు కారణమవుతాయి. శరీరానికి, మనసుకి వాటిని తట్టుకునే శక్తి పొందడానికి శరన్నవరాత్రుల్లో ప్రజలు చేసే దీక్షలు ఉపయోగపడతాయి. మన శరీరంలోనే మనకు సహాయపడే శక్తులు, హాని కలిగించేవి కూడా ఉన్నాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణనే మహాశక్తి రాక్షసులతో చేసే యుద్ధంగా భావించవచ్చు. మరెన్నో సామాజిక, ఖగోళ అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.