హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. రోడ్డు పాలైతిమి ఉయ్యాలో..
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. దానింట్ల పీనుగెల్ల ఉయ్యాలో..
బతుకమ్మ వచ్చింది ఉయ్యాలో.. పండుగే లేదాయె ఉయ్యాలో..
మేం గరీబోళ్లం ఉయ్యాలో.. బతుకమ్మ లేదాయె ఉయ్యాలో..
మా అందరింట్ల ఉయ్యాలో .. పండుగే లేదాయె ఉయ్యాలో..
కట్టుబట్టలులేవాయో.. ఎక్కడని పోదుమూ ఉయ్యాలో..
ఎవనింటికెలుదుం ఉయ్యాలో.. పండుగా పూట ఉయ్యాలో
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. దానింట్ల పీనుగెల్ల ఉయ్యాలో..
పెత్రామాస్య రోజున తమ ఇండ్లు కూల్చేసిన హైడ్రాతీరును ఎండగడ్తూ, హైడ్రాకు శాపనార్థాలు పెడుతూ గాజులరామారం బస్తీల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఇంట్లోంచి బయట పడేసిన నిత్యావసరాలు, ఇంటిసామాన్లనే బతుకమ్మలుగా భావిస్తూ కొందరు పిల్లలు చేతిలో పుస్తకాలు పట్టుకొని ఉండగా, పెద్దవారు కూర్చుని ఉంటే వారి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడుతూ హైడ్రాపై పాటగట్టి తమకు బతుకమ్మ పండుగ లేకుండా చేశారన్న ఆవేదనను, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. తాము కొనుక్కున్న ఇండ్లను కూల్చవద్దని అధికారులను వేడుకున్నారు.
మేము కొనుక్కున్న ఇండ్లను కూల్చవద్దని ఒక్కసారిగా వచ్చి మా ఇండ్లను కూల్చేస్తే చిన్నచిన్న పిల్లలను తీసుకుని తాము ఎక్కడికి వెళ్లాలి.. మా ఇండ్లను కూల్చి తమను రోడ్డున పడేయకండి అంటూ కన్నీరుమున్నీరయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కొన్న ఇండ్లను కూల్చేస్తున్నారంటూ బాధితులు కొందరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ … పరిధిలోని గాలిపోచమ్మబస్తీ, బాలయ్యనగర్బస్తీ, రాజరాజేంద్రబస్తీ, ఆబిద్బస్తీలలో హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
తమ ఇండ్లను కూల్చొద్దంటూ స్థానికులు హైడ్రా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కాళ్లావేళ్లాపడినా అసలు ఎవరూ పట్టించుకోకపోవడంతో వారు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పండుగ పూట ఇంట్లో సంబరాలు జరుపుకోకుండా చేస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు. తమ నిరసనలను విభిన్న రూపాల్లో తెలిపేందుకు ప్రయత్నం చేశారు. హైడ్రా కూల్చివేతలపై బతుకమ్మ పాట కట్టి మహిళలు, యువతులు తమ ఇండ్లలోంచి బయటపడేసిన సామగ్రి చుట్టూ తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు. కూల్చివేతల సమయంలో ఒక మహిళకు ఫిట్స్ వచ్చి కిందపడిపోవడంతో స్థానికులు మరింత కోపానికి వచ్చి అధికారులను నిలదీశారు.
ఆమెను ఆసుపత్రికి కొందరు స్థానికులు తరలించారు. మరికొందరు మహిళలు అక్కడే ఉన్న కేబుల్‌వైర్లను పట్టుకొని హైడ్రా కూల్చివేతలు ఆపేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ మొండికేశారు. హైడ్రా జేసీబీలను స్థానిక మహిళలతో పాటు కొందరు అడ్డుకొని నానా బూతులు తిడుతూ మన్నుపోశారు. ఆబిద్బస్తీలో జేసీబీ కూల్చివేతలు చేపడ్తుంటే వచ్చిన స్థానికులు జేసీబీపై రాళ్లు రువ్వారు. మనుషులు చచ్చిపోతుంటే జేసీబీలను నడుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో జేసీబీ పాక్షికంగా ధ్వంసం కావడంతో పోలీసులు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు.
రజాకార్లను మరిపిస్తున్న రేవంత్ సర్కారు
రియల్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఆనాటి రజాకార్ల పాలనకు పరాకాష్టకు చేరిందని తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గాజులరామారాం పేదల ఇండ్ల కూల్చివేతలపై ఈ మేరకు స్పందించారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు, బలవంతపు వసూళ్లే తప్ప.. పేదలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను గాలికొదిలి, ప్రజా పాలన పేరిట పేదలపై యమపాశం వదులుతోందన్నారు. పేదలే లక్ష్యంగా విరుచుకుపడే రేవంత్ రెడ్డి.. రజాకార్లకు మరిపిస్తున్నారన్నారు.
నిజాం సర్కారులో రజాకార్లు, కాంగ్రెస్ సర్కారులో హైడ్రా ఒకేతీరుగా తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారాయన్నారు. చెరువులను కబ్జా చేసి కట్టుకున్న కమర్షియల్ భవనాలు, ఫామ్ హౌజ్‌లను కూల్చే ధైర్యం హైడ్రాకు లేదన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో ప్రజాప్రతినిధులు కట్టుకున్న ఇండ్లను కూల్చలేని సర్కారు… పేదల కట్టుకున్న గుడిసెలపైకి బుల్డోజర్లు ఎగదోయడం సిగ్గు చేటన్నారు. పేదలపై జరుగుతున్న దారుణాలతో విసిగిపోయారని, రజాకార్ల పాలనను మరిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వాత పెట్టాల్సిన అవసరం ఉందని నారగోని ఆగ్రహం వ్యక్తం చేశారు.