నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 23 : కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. బారికేడ్లు తొలగించుకొని లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని వ్యాన్లలో ఎక్కించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. ఖమ్మంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆశా కార్యకర్తలు తొలుత ర్యాలీ, ఆ తరువాత రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కనీ వేతనం చెల్లించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా కార్యకర్తలు ఎదురుచూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశా వర్కర్ల సమ్మెకు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల సోమవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆశ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఆశా వర్కర్ల జీతాలను రూ.18వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా రూపాయి కూడా పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగూడెం గణేశ్‌టెంపుల్, మార్చి 23 : తమ పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను తమకే అప్పగించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారం 8వ రోజుకు చేరింది. దీక్షల్లో భాగంగా ఆదివాసీ మహిళలు కలెక్టరేట్ నుంచి నవభారత్ వరకు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామన్నగూడెం గ్రామ రెవెన్యూ పరిధి 30, 36, 39, సర్వే నంబర్లలో 573 ఎకరాల్లో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఆ భూములకు సంబంధించి తమ వద్ద పట్టాలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే తమ భూములు అప్పగించాలని, అప్పటి వరకు దీక్షను విరమించేది లేదని తేల్చిచెప్పారు.