ఖైరతాబాద్, మే 1 : నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ నెల 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సంస్థాన్ ప్రతినిధి అల్కా చౌదరి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సంస్థాన్ హైదరాబాద్ ఆశ్రమ హెడ్ హమేందర్ సింగ్ రావత్, కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం ఇన్చార్జి హరి ప్రసాద్ లడ్డా, అభయ్ చౌదరి, ప్రభుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో అనేక మంది వివిధ ప్రమాదాలు, పుట్టుకతో దివ్యాంగులుగా మారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
అలాంటి వారిని గుర్తించి వారు సాధారణ జీవితం కొనసాగించేందుకు దశాబ్దాలుగా నారాయణ సేవా సంస్థాన్ కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వస్తోందన్నారు. క్రృతిమ అవయవాల కోసం మూడు నెలల క్రితమే అవసరమైన వారి మెజర్మెంట్లు తీసుకున్నామని, 815 మందికి వారి వారికి సరిపోయే విధంగా అందిస్తామన్నారు. అంతేకాకుండా అదనంగా అందించేందుకు ఉదయ్‌పూర్ నుంచి 50 మంది టెక్నిషియన్లు వస్తున్నారని, అవసరమైన వారికి అక్కడికక్కడే కృత్రిమ అవయవాలను సిద్ధం చేసి ఇస్తారన్నారు.