జహీరాబాద్ ఫిబ్రవరి 16 : ప్రేమే ఆ బాలిక పట్ల శాపమైంది. కన్నతల్లే కర్కశానికి ఒడిగట్టింది. నవ మాసాలు మోసిన కనిపెంచిన బిడ్డను తన చేతులతోనే కడతేర్చింది. ఈ ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
జహీరాబాద్లో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. జహీరాబాద్ డీఎస్పీ జి. శంకర్ రాజు బుధవారం జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి చెందిన బాలికను (17) హత్య చేసిన తల్లి బుజ్జమ్మతో పాటు కాసింపూర్ గ్రామానికి చెందిన గొల్ల నరసింహులును అరెస్ట్ చేశామన్నారు.
బాలిక అదే గ్రామానికి చెందిన ఫకీర్ అప్సర్ అనే యువకుడిని ప్రేమిస్తున్నది. ప్రేమించడం మానుకోవాలని తల్లి బుజ్జమ్మ, గొల్ల నర్సింహులు సదరు బాలికకు పలుమార్లు చెప్పినా తీరు మారక పోవడంతో బాలికను హత్య చేశారన్నారు.
బాలిక తల్లి కాసింపూర్ గ్రామానికి చెందిన గొల్ల నరసింహులుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. కాగా, ఎలాగైనా బాలికను హత్య చేయాలని తల్లి నిర్ణయించుకుంది. అందులో భాగంగా వారు జహీరాబాద్ పట్టణంలో మద్యం తీసుకున్నారు.
అక్కడి నుంచి ఇంటికి వెళ్లి బాలికను తీసుకొని గ్రామ సమీపంలోని మామిడి తోటకి వెళ్లారు. అక్కడ బుజ్జమ్మ కూతురిని ప్రేమించడం మానుకోవాలని బెదిరించినా వినకపోవడంతో బాలికలపై బుజ్జమ్మ కూర్చోగా.. నర్సింహులు చున్నీని మెడకు బిగించి హత్య చేశారన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటల్లో కేసును చేదించిన జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్, రవి శ్రీకాంత్, కాశీనాథ్ లను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు ప్రకటించేందుకు జిల్లా ఎస్పీకి నివేదిక ఇస్తామని తెలిపారు.