అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నల్గురు కోసం గాలిస్తున్నారు. రెండురోజుల క్రితం గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామంలోని ఓ దుకాణాదారుడు వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సరుకులు కొనుగోలు చేసి రూ.200నోటును అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ నోటును తీక్షణంగా గమనించిన దుకాణ యజమాని నకిలీ నోటుగా గుర్తించి మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు గుంటూరు జిల్లాకు చెందిన ఒకరిని,అనంతరం మరొకరిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వివరాలను బయటపెట్టారని పోలీసులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి గుంటూరులో నెలరోజులుగా కలర్ జిరాక్స్ సహాయంతో రూ.100, 200, 500 నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నారని వివరించారు. దాదాపు లక్షల్లోనే ఈ నోట్లను చలామణి చేశారని పోలీసులు వెల్లడించారు. పట్టుకున్న ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు.