పోటిసునితోపాటు సవరసత్తిని కూడా అలక్కుడు భూగృహం ఉన్న మామిడి తోట వద్దకు తీసుకొని పోయినాడు. మానుడు రాజాజ్ఞను అనుసరించి అంతఃపురంలోని వాళ్లందరినీ పిలిచినాడు. కమలసత్తికి వైద్యం చేసి వెళ్తున్న ఆనందుణ్ని కలుసుకుంటుంది భాణు. తర్వాత..
“ఎవరు నువ్వు?” కఠినంగా.. రాజు సౌరిసంబ. “నేను ఒక రైతును మహారాజా!” భయంతో ఆగంతకుడు. “ఏం పేరు?” “సచ్చసామి!” “ఏ ఊరు?” “జంగిటి!” “ఇక్కడ నీకేం పని..?” “ఒక పని కోసం వచ్చిన ప్రభూ!” “అదే.. ఏం పని?” మరింత గంభీరంగా అడిగినాడు మహారాజు. కుసుమ శ్రేష్ఠి భవనం వద్ద కూడా ఇంతకు మించిన సమాచారం ఇవ్వలేదు సచ్చసామి. అందుకే భటులు పట్టుకొని వచ్చినారు. “జవాబు చెప్పవేం?” గద్దించినాడు. “మా ఆడవాళ్లు పంపిస్తే వచ్చినాను ప్రభూ!” “మీ ఆడవాళ్లు అంటే..?” రాజు కనుబొమలు ముడివడ్డాయి. “మా వాళ్లే మహారాజా!” “మీ వాళ్లకు ఆ భవనంతో ఏమి సంబంధం?” “…”
“ఇంతకూ ఆ భవనం ఎవరిదో తెలుసునా?”
“తెలుసు ప్రభూ! కుసుమ శ్రేష్ఠులవారిది!”
“మీ ఆడవాళ్లకు కుసుమ శ్రేష్ఠికి ఏమిటి సంబంధం?”
“అది.. అది.. అదీ..” దిక్కులు చూసినాడు సచ్చసామి.
“తలవరిని కొరడా తీసుకొని రమ్మని చెప్పండి!” సౌరిసంబ కంఠం ఖంగున మోగింది.
సచ్చసామి పై ప్రాణాలు పైనే పోయినాయి.‘ఈ ఆడవాళ్లు సామాన్యులు గారు! నన్ను చంపడానికే ఇక్కడికి పంపినారు’ అనుకుంటుంటే.. అతని కళ్లల్లో నీళ్లు తిరిగినాయి. అతను ఆలోచించుకునే లోపు తలవరి అక్కడ కొరడాతో ప్రత్యక్షమైనాడు. ఆ తలవరి ఉక్కు గుండుతో తయారు చేసిన మనిషిలా; నల్లరాతి విగ్రహంలా; చిన్న కొండలా ఉన్నాడు. నల్లటి మీసాలు చెవుల దాకా మొహం మీద పరుచుకున్నాయి. ఒంటిమీద.. పైన ఏమీ లేదు; కింద మోకాళ్లు దాటని పంచె ఒకటి కట్టుకున్నాడు; చేతులకు, కాళ్లకు కడియాలున్నాయి. చూస్తుండగానే భుజం మీద కొరడా అతని చేతిలోకి వచ్చి సచ్చసామి దేహాన్ని అల్లుకొని చుర్రు.. మనిపించింది. “అమ్మో.. నాయనో.. దేవుడా.. మహాప్రభో!” అంటూ ఒక్క దెబ్బకే రాజుగారి ముందు సాష్టాంగ పడ్డాడు. “చెప్పు! అన్నీ వివరంగా చెప్తావా? మరో నాలుగు అంటించమంటావా?” అన్నాడు రాజు. “వద్దు ప్రభూ! అన్నీ చెప్తా! ఆ ఆడవాళ్లకు నాకు ఏ సంబంధం లేదు..!” అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ సచ్చసామి. “మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి?” “వాళ్ల కోసమే ప్రభూ!” “ఆఁ..! ఏం తిక్క తిక్కగా ఉందా? సంబంధం లేదంటావు; వాళ్ల కోసమే వచ్చినాను అంటావు? వాళ్లకు, కుసుమ శ్రేష్ఠికి ఏమి సంబంధం?” “ఏమీ లేదు ప్రభూ!” రాజు కనుసైగతో తలవరి మరోసారి తన కొరడాకు పని చెప్పినాడు. “చస్తిరా! దేవుడా!” అని నాట్యమాడుతూ, తదనుగుణంగా ఏడుపు రాగం ఆలపించి.. “చెప్తూనే ఉన్నాను కదా మహారాజా! ఈ మనిషిని కొంచెం దూరంగా ఉండుమని చెప్పండి!
లేకుంటే నాకు తెలిసిన సంగతులు కూడా మరచిపోతాను!” అన్నాడు సచ్చసామి. “ఒరేయ్ చవట స్వామీ! నీవెవరు? వాళ్లు ఎవరు? వాళ్లకు నీకు సంబంధం ఏమిటి? మీకు, కుసుమ శ్రేష్ఠి భవనానికి ఏమి సంబంధం? అన్ని నిజాలూ చెప్పాలి; వివరంగా చెప్పాలి! చెప్పకపోతే ఇక నేను మధ్యలో అడ్డుకోను! వాడు నిన్ను కొట్టి చంపేస్తాడు. అంతే!” అన్నాడు చివరి హెచ్చరికలా మహారాజు. ఇక తనకు తెలిసిందంతా పూసగుచ్చినట్లు చెప్పక తప్పలేదు సచ్చసామికి. “అంతా బాగానే ఉంది. ఇది మా అమ్మాయి కథనే అనిపిస్తున్నది. కానీ.. పెద్దావిడ గుడ్డిది అంటున్నాడు; దూర దేశం పోయిన ఆమె కొడుకు తిరిగి వచ్చినాడు అంటున్నాడు.. ఇవే అర్థం కావడం లేదు మహారాజా! పైగా తనకొక చెల్లి కూడా ఉందంటున్నాడు” అంతా అయోమయంగా అనిపించ సాగింది మేఘచంద్రునికి. “ఏమిరా అసత్య సామి? నిజాలు దాచడం లేదు కదా!” బెదిరిస్తున్నట్లు అన్నాడు సౌరిసంబ మహారాజు. “మహాప్రభో! నేను నిజం చెప్పకపోతే బతకనని తెలిసింది కదా! మా అమ్మతోడు! ఇవన్నీ నిజాలే! ఇందులో ఒక్కమాట కూడా అబద్ధం లేదు!” తలమీద చేయి పెట్టుకొని ప్రమాణం చేసినాడు. అతను అబద్ధం ఆడటం లేదని అందరికీ అర్థమైంది. “వీని వెంట మన మనిషిని పంపుదాం మహారాజా!
పంపి, ఆ ఆడవాళ్లని ఇక్కడికి తెప్పిద్దాం!” అన్నాడు మంత్రి చామీకరుడు. “అతను చెబుతున్న విషయాలు కొన్ని అసంబద్ధంగా అనిపిస్తున్నా, చాలా విషయాలు మా బావగారి కుటుంబానికి సరిపోతున్నాయి! పెద్ద కోడలు విషయాలైతే నూటికి నూరుపాళ్లు మా రోహకు సంబంధించినవే! అక్కడికి నేను వెళ్తేనే అన్ని సంగతులూ స్పష్టమవుతాయి” ఆలోచిస్తూ అన్నాడు మేఘచంద్రుడు. “తమరు మా మిత్రుని ప్రయాణానికి ఏర్పాటు చేయించండి మహారాజా!” అని సౌరిసంబ రాజును అభ్యర్థించి.. “నన్ను కూడా నీతో రమ్మంటావా మిత్రమా?” అన్నాడు మేఘచంద్రునితో విష్ణుముఖుడు. “మహారాజా! మీరు ఇంతవరకు చేసిన మహోపకారమే ఎంతో గొప్పది! ఇప్పటికే మీకు చాలా శ్రమ ఇచ్చినాను. ఇక మీరు వెళ్లండి! మహారాజు గారి సహకారంతో మిగతా కార్యం నేను చక్కబెట్టుకుంటాను!” అంటూ వినయంగా విష్ణు ముఖునికి నమస్కరించినాడు మేఘచంద్రుడు. “మిత్రమా! మేఘచంద్రుడు ఇకనుండి మా మిత్రుడు కూడా! ఇతను మాకు కుసుమ శ్రేష్ఠితో సమానం. తమరు నిశ్చింతగా వెళ్లిరండి!” అని విష్ణుముఖునితో పలికి.. “మహామంత్రీ! మేఘచంద్రునికి కావలసిన ఏర్పాట్లు చేయండి; పూర్తి సహకారం అందించండి! ఏలోటూ రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే!” అన్నాడు చామీకరునితో. “మేఘచంద్ర శ్రేష్ఠులవారికి కావలసినవన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను ప్రభూ!” అన్నాడు చామీకరుడు. తన కూతురిక దొరికినట్లే అనుకున్నాడు మేఘచంద్రుడు. ఆమె దొరకకుండా పారిపోతున్నదని ఈ పిచ్చి తండ్రికి తెలియదు కదా!
‘ఈసాణుడు చాలా పటిష్టమైన పథకం వేసినాడు. ఇక తప్పించుకోవడం అసాధ్యం!’ అనుకున్నారు ఒకేసారి వేరువేరుగా.. అవణాయరు, వామదేవుడు, సౌగంధిక. కానీ వాళ్ల ఆత్మబలం, ఆత్మవిశ్వాసం వేరువేరుగా ఉన్నాయి. ‘ఇన్నాళ్ల బతుకు జీవచ్ఛవ సమానమే! ఇప్పుడు బతికినా, చచ్చినా ఒకటే! చచ్చేలోపు ఈ ఈసాణుడిని ఏదో ఒకటి చేయాలి. అయినా ఈసాణుడు నన్ను ఎందుకు చంపుతాడు?’ అనుకున్నాడు అవణాయరు. ‘వానికి దొరక్కదొరక్క దొరికినాను. వదిలి పెడతాడా? దుర్మార్గుడు! నా ప్రాణం కంటే మానమే వానికి ముఖ్యం. దేవుడా! చివరికి ఇటువంటి పరిస్థితిని తెచ్చినావెందుకు? నా వామదేవుడు నాకు దక్కకుంటే ముందు నా ప్రాణాలు పోయేటట్లు చూడు! ఆ దుర్మార్గుడు నన్ను తాకడం కంటే నరకం వేరొకటి ఉండదు!’ అనుకుంటూ కన్నీటి పర్యంత మయ్యింది సౌగంధిక. ‘ఇంత పోరాటం చేసి; ఇన్ని ప్రయత్నాలు చేసి; ఇన్ని వేషాలు వేసి.. చివరికి వీని చేతికి చిక్కి నిస్సహాయంగా చావడమా? కుదరదు! భగవంతుడు ఏదో విధంగా ఒక కొత్తదారి చూపిస్తాడు!’ అనుకుంటూ, పరిసరాలన్నీ అణువణువూ శ్రద్ధగా గమనిస్తున్నాడు వామదేవుడు. “ఒరేయ్ వామదేవా! మిమ్ములను సముద్ర తీరంలోనే సమాధి చేయవలసిందిరా! పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదు; అప్పుడు మిమ్ములను తక్కువగా అంచనా వేసినందుకు పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. అయినా చావు నుండి మాత్రం తప్పించుకోలేరు కదా! నిన్ను అంతఃపురంలోనే అంతం చేయాలనుకున్నాను కానీ, నీ మిత్రుని చావు నీవు చూడాలి; నీ ప్రేయసి నరక బాధను చూసి నీవు విలవిల్లాడాలి. అందుకే ఇంతదూరం తీసుకొని వచ్చినాను! అవునూ.. నీ స్నేహితుణ్ని చూడవా? ఏం మిత్రులురా నాయనా!” అంటూ..
“ఎవరక్కడ? ఆ జయసేనుణ్ని పట్టుకొని రండి!” అని ఆజ్ఞాపించినాడు. “చిత్తం మహారాజా!” అంటూ, మరు నిమిషంలో బలమైన పగ్గాలతో జయసేనుణ్ని బంధించి తెచ్చి, ఎదురుగా ఉన్న మద్దిచెట్టుకు కట్టేసినారు సైనికులు.“అయినా మీ ధైర్య సాహసాలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రా! వంచనకే వంచన నేర్పించగల ఈ ఈసాణుడి కంట్లోనే కారం కొట్టడానికి సిద్ధపడ్డారు కదరా!” అంటూ..“వీళ్లని ఏం చేద్దాం అంటావు రా అవణా!” అన్నాడు. “నీవు చేసేదేమున్నది రా? ఆ భగవంతుడు చేయాలి!” అన్నాడు.. నిర్భయంగా అవణాయరు. “అబ్బా! ఎంత ధైర్యం వచ్చిందిరా! ఇదంతా చావు ధైర్యం! ఎలాగూ చావు తప్పదనుకున్నప్పుడే ఇటువంటి మాటలు వస్తాయిలే!” అన్నాడు వెటకారంగా ఈసాణుడు. “నీవు చావు తెలివితేటలు చూపగా లేనిది, మేం చావు ధైర్యం చూపడంలో ఆశ్చర్యమేమున్నదిరా?” ఏమాత్రం తగ్గలేదు అవణాయరు. “ఛ! వీళ్లతో మాటలేందిరా! ఒక్కొక్కడిని అనుకున్నట్లే అంతం చేయడమే మేలు!” అంటూ ఒక భటుని చేతిలోని ఈటెను తీసుకొని గురి చూసి ఎదురుగా ఉన్న జయసేనుని మీదికి విసిరినాడు. అది శరవేగంగా వెళ్లింది కానీ, అతని గుండెను తాకకుండానే ఆగిపోయింది. ఎవరో ఒక మహావీరుడు గాలిలో తేలుతూ వచ్చి.. జయసేనుడి గుండెను తాకబోతున్న ఆ ఈటెను ఒడిసి పట్టుకున్నాడు. “ఒరేయ్ ఈసాణా! ఈరోజుతో నీ ఆట కట్టు!” అన్నాడు.. ఆ ఈటెను చేతిలో పట్టుకొని హెచ్చరిస్తూ! అందరూ ఆశ్చర్యంగా అతణ్ని చూసినారు.
“ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేక పోయినాను తెలుసా?” ప్రణాలుని చేతులు పట్టుకుంటూ అన్నది భాణుసత్తి రూపంలోని రోహాదేవి. “సుందరీ! ప్రేమ అన్నీ నేర్పిస్తుంది! అబద్ధాలు ఆడిస్తుంది; వంచనలను చేయిస్తుంది; వేషాలను వేయిస్తుంది; చేయరాని పనులను చేయిస్తుంది. మనం సురక్షితంగా వెళ్లడానికి ఇదే సరైన మార్గం అనిపించింది. నేనిప్పుడు బౌద్ధ సన్యాసిని; నీవు కూడా బుద్ధుని మార్గంలో నడిచే సన్యాసినివే!” అన్నాడు నవ్వుతూ ప్రణాలుడు. “నేనా! ఎట్లా?” ఆశ్చర్యపోతూ అన్నది. “ఇట్లా!” అంటూ తన సంచిలో ఉన్న కాషాయ వస్త్రాలను ఆమెకు అందించినాడు. ఆశ్చర్యానందాలతో అతణ్ని అల్లుకోవాలని దగ్గరగా వచ్చింది రోహ. “ఒక్క క్షణం! మీరు ఇప్పుడు పరాయి స్త్రీ! మిమ్ములను ఇట్లా తాకడానికి నా మనసొప్పదు. ఏదో ఒక వివాహబంధంతో మనం ఒక్కటైన తర్వాతనే ఒక్కటి కావాలి! అంతవరకూ దూరం పాటించుదాం! పైగా మనం ఈ వేషాల్లో కలవడం దోషమే కాదు.. సంఘద్రోహం కూడా!” అంటూ సున్నితంగా ఆమెను వారించినాడు ప్రణాలానందుడు. ఆ మాటలతో రోహకు అతని పట్ల అభిమానంతోపాటు గౌరవం కూడా పెరిగింది. “మీరు చాలా గొప్పవారు!” అన్నది అభిమానంగా. “ఈ గొప్పతనం నాది కాదు, బౌద్ధ ధర్మానిది!” అన్నాడు పైకి; లోలోన ఏదో పొరపాటు చేస్తున్నానన్న ఆత్మన్యూనత అతణ్ని కుదిపేయసాగింది. మంచివాని మనసు మరుగున నుండెడి ఏ రహస్యమైన నెటుల వెడలు కలత చెందనేమి, కన్నీరు గారనీ కట్టె కాలు దాక గుట్టు దాగు!
(మంచివాని మనసు చాటున ఉండే రహస్యం ఏదైనా అది బయటికి రాదు. కలతపడినా, కన్నీళ్లు కారినా సరే! శరీరం శ్మశానంలో కాలిపోయేదాకా రహస్యం బయటపడదు) ఆమె కాషాయ వస్త్రాలు ధరించింది! ప్రేమంటే కేవలం కోరికలు తీర్చుకోవడం కాదని, పరస్పర అభిమానమని; ఒకరినొకరు గౌరవించడమని ఆమెకు కొత్తగా అనుభవంలోకి వస్తున్నది. నియమబద్ధమైన జీవితం గడపడంలో కూడా ఎంతో ఆనందం, తృప్తి ఉంటాయని అతణ్ని చూస్తే తెలుస్తున్నది. “ఇప్పుడు ఎక్కడికి వెళ్లడం? ఏం చేయడం?” అన్నది కొత్త చీరను సవరించుకుంటూ. “నిజానికి ఈ సమయానికి నేను శ్రీకూర్మంలో ఉండాలి! గురువుగారికి నా అంతరంగం ఎరిగించాలి! ఆలస్యానికి కారణాలు తెలపాలి!” “గురువుగారు వద్దంటే నన్ను వదిలేస్తావా?” ఠక్కున అడిగింది ఆమె. అతను కంగారు పడలేదు; నిశ్చలంగా ఇట్లా అన్నాడు.. “నేనిప్పుడు నిన్ను కట్టుకోలేదు; పట్టుకోలేదు! అప్పుడు వదిలేయడం అన్న మాటకు తావులేదు కదా!” ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేక పోయింది. ఇద్దరూ చాలాదూరం మౌనంగానే నడిచినారు. ఆమె హఠాత్తుగా అన్నది..
“నన్ను మళ్లీ జంగిటిలో మా అత్తగారి వద్ద వదిలేసెయ్!” కన్నీరు ఆగడం లేదు ఆమెకు. “ఎందుకని?” అతను చల్లగా అడిగినాడు. “నీకు కనీసం నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు!” కన్నీరు తుడుచుకునే ప్రయత్నం చేస్తూ అన్నది. “విషయం అది కాదు! భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా!” సాలోచనగా అన్నాడు అతను. “నిజం చెప్పు! నేనంటే నీకు అసలు ఇష్టం లేదు కదూ!” అతని బాటకు అడ్డంగా నిలబడి అన్నది రోహ. “మొదటి నుండీ నీ పట్ల నాకు ఇష్టమే ఉన్నది కానీ, దాన్ని వ్యక్తం చేసే సందర్భమే రాలేదు; వచ్చినా ఏదో ఒత్తిడిలో ఉన్నాం!” “ప్రేమ ఉన్నచోట ఇటువంటి పనికిమాలిన కారణాలు ఎప్పటికీ అడ్డంకి కాజాలవు!” “అయితే.. ప్రేమ లేనట్లే కదా!” ఆ మాట విని ఇద్దరూ ఉలిక్కిపడ్డారు! ఆ శబ్దం వినవచ్చిన దిక్కు చూసినారు ఆశ్చర్యంగా!