సిటీబ్యూరో: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పన్నీర్‌తో పాటు ఇతర పాల ఉత్పత్తుల తయారీ, విక్రయ కేంద్రాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంతో పాటు పరిసర జిల్లాల్లో మొత్తం 14 డెయిరీ యూనిట్లను 12 ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి.
పలు యూనిట్లలో పరిశుభ్రత లోపాలు, అనుమతిలేని పదార్థాల వినియోగం, పాల సేకరణకు సంబంధించిన సరైన రికార్డులు లేకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. కొన్ని పన్నీర్ తయారీ యూనిట్లలో లూజ్ పామ్ ఆయిల్, గ్లిసెరాల్ మోనోస్టియరేట్ వంటి పదార్థాలు ఉన్నట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. కొన్ని ప్రాంతాల్లో బొద్దింకలు, ఈగల బెడదతో పాటు పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడం వెలుగులోకి వచ్చింది.
కల్తీ అనుమానంతో మొత్తం 21 నమూనాలను సేకరించిన అధికారులు నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. సుమారు రూ.7,19,340 విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఖానాపూర్లోని శ్రీ మహాలక్ష్మీ కేంద్రం, హయత్‌నగర్‌లోని అనిత డెయిరీకి లోపాలను సరిదిద్దాలని ఇంప్రూవ్ మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నాదర్ గుల్లోని గీతా డెయిరీ, నార్ముల్ (మదర్ డెయిరీ)లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.