న్యూయార్క్: ఇటీవల నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి.. బొటేకోశి-త్రిశూలీ నది ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఆ జల విలయం వల్ల సుమారు మూడు వేల మంది మరణించారు. ఈ ఘటన గురించి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా(Nepal PM Balendra) .. ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ విపత్తును ఆయన హిమాలయన్ సునామీగా వర్ణించారు. హిమాలయాల్లో వాతావరణ సంక్షోభం ఏర్పడిందని, దీన్ని ఓ దూరపు సమస్యగా చూడవద్దు అని ఆయన అన్నారు. 81వ జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. హిమాలయాల్లో వచ్చిన జల ప్రళయం యావత్ ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చిందన్నారు.
అక్కడ ఇటీవల సంభవించిన వరదలను హిమాలయన్ సునామీగా ఆయన అభివర్ణించారు. బండరాళ్లు, బురదలో అనేక మంది మిస్సయ్యారని, ఇది తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. బోటెకోశి-త్రిశూలీ విషాదం కేవలం లోకల్ ట్రాజిడీ కాదన్నారు. నేపాల్ ఇచ్చిన సందేశం.. యావత్ మానవాళికి వార్నింగ్ అన్నారు. వాతావరణ సమస్యలు ఎలా జాతీయ విపత్తుగా మారుతుందో తాజా విధ్వంసాన్ని గమనిస్తే స్పష్టం అవుతుందన్నారు.
నేపాల్ వరదల్లో కనీసం 1400 మంది మరణించినట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. మరో ఆరు వేల మంది మిస్సింగ్‌లో ఉన్నారన్నారు. ఓ అతిపెద్ద విపత్తు.. ఎన్నో ఏళ్ల అభివృద్ధిని తుడిచి పెట్టేస్తుందని ప్రధాని బాలేద్ర షా అన్నారు. ప్రమాదకరంగా మారిన వాతావరణంతో.. హిమాలయాల్లోని జీవజాలం దెబ్బతింటోందన్నారు. పెర్మాఫ్రోస్ట్ కరిగిపోవడం, కొండలు అస్థిరంగా మారడం, కొండ చరియలు విరిగిపడడం, వరదలు, బురద .. అన్నీ ప్రమాదకరంగా మారినట్లు చెప్పారు. ఇది ఒక ప్రాంతానికి లేదా దేశానికి చెందిన అంశం కాదు అని, ఎందుకంటే నీళ్లు, విపత్తులు దేశ సరిహద్దులు దాటుతాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు అనేవి సరిహద్దులను గుర్తించవని, గ్లేసియర్లు.. వరదలు.. స్టాంప్ చేసిన వీసాతో రావు అని అన్నారు. వాతావరణ సమస్యలను పరిష్కరించేందుకు భారత్, చైనా దేశాలు సహకరించాలని ఆయన కోరారు.