హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అర్హత ఉన్న ప్రతి ఒకరికీ న్యాయం జరిగేలా వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు శనివారం సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్యులర్ జారీచేశారు. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల జాబితా ఖరారు, జిల్లా కలెక్టర్ ఆమోదం, ఆ తర్వాత మంజూరు ఉత్తర్వుల జారీకి సంబంధించిన విధానాన్ని సర్యులర్‌లో స్పష్టంగా వెల్లడించారు.
కొత్త చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం ‘డిజిగ్నేటెడ్ వెరిఫికేషన్ ఆఫీసర్ల (డీవీవోలు)ను నియమించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇతర మండలస్థాయి ప్రభుత్వ అధికారులు, సూపరింటెండెంట్ స్థాయి లేదా అంతకంటే పైస్థాయి వారిని వెరిఫికేషన్ అధికారులుగా నియమించనున్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో సూపరింటెండెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ప్లానింగ్ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ స్థాయి లేదా అంతకంటే పైస్థాయి అధికారులు దరఖాస్తులను పరిశీలించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లోనూ సహాయ మున్సిపల్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్స్థాయి, అంతకంటే పైస్థాయి అధికారులు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌ను రూపొందించారు. నియమిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలు, తమ అభిప్రాయాలను యాప్‌లో నమోదు చేయాలి. ప్రభుత్వం గతంలో జారీచేసిన సంబంధిత ఉత్తర్వుల్లోని అర్హతలు, నిబంధనలు, ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌లో భాగంగా అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలి. దరఖాస్తుదారుడి నిజమైన గుర్తింపు, నివాస స్థితి, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, కోరుతున్న పెన్షన్ క్యాటగిరీతోపాటు పథకంలో నిర్దేశించిన ఇతర అర్హతలను పరిశీలించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారుడు అర్హుడా? అనర్హుడా? అనే విషయాన్ని మొబైల్ యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలి.
అనర్హుడిగా తేలితే అందుకు గల నిర్దిష్ట కారణాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. తప్పుడు గుర్తింపు లేదా తప్పుడు ధ్రువీకరణ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుందని సర్యులర్‌లో పేరొన్నారు. దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారుల జాబితాను సంబంధిత డీఆర్డీవోలకు పంపాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.