రోజుకో హత్య.. వేధింపులు.. కిడ్నాప్‌లు.. దోపిడీలు.. దొంగతనాలు.. గన్ఫైరింగ్లతో హైదరాబాద్ నేరాలకు అడ్డాగా మారింది. 2024 నుంచి నేటి వరకు నగరంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో జరిగిన నేరాలు గమనిస్తే పోలీసింగ్ ఎంతగా బలహీనపడిందో తెలుస్తోంది. పోక్సో, లైంగిక వేధింపుల కేసుల్లో నగరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందా.. భాగ్యనగరం మరో బీహార్‌గా మారబోతుందా.. వరుస ఘటనలతో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం గడుపుతున్నారు.
నెలరోజుల్లో దాదాపు 20కిపైగా హత్యలు చోటుచేసుకోవడం పరిస్థితులకు అద్దంపడుతోంది. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో నెలకు సగటున 13మంది హత్యకు గురికాగా, గత నెలరోజుల్లో ఈ సంఖ్య 20కి దాటడం కలవరపెడుతోంది. 2023తో పోలిస్తే 2024లో ట్రై కమిషరేట్ పరిధిలో 41శాతం నేరాలు పెరగగా 2025లో కూడా దాదాపుగా అదే స్థాయిలో నేరాలు జరిగాయి. ఈసారి ఆగస్టు వరకే 40శాతం పెరిగినట్లుగా పోలీసులు అంచనావేస్తున్నారు. 30నెలల్లో నాలుగు కమిషనరేట్లలో కలిపి 2.5లక్షల కేసులు నమోదు కాగా హత్య కేసులు వెయ్యికి పైగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ)నగరంలో నిఘావ్యవస్థ నిద్రపోతున్నది. విజిబుల్ పోలీసింగ్ లేకుండా పోవడంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. నేరాల సంఖ్య పెరిగింది. హత్యలతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. నేరాలు చేసే వారిలో మైనర్లు ఉంటుండడంతో నేరాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. గతంలో రోడ్లపై విజిబుల్ పోలీసింగ్ కనిపించేది. తరచూ పోలీసు గస్తీ తిరిగేది. కానీ ప్రస్తుతం గస్తీకి సుస్తీ చేసింది. ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసు గస్తీ ముమ్మురంగా ఉండి శాంతిభద్రతల నిర్వహణ సుస్థిరంగా ఉండేది.
కానీ ఇప్పుడు సీసీ కెమెరాలున్నా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల గస్తీ కొన్నిచోట్ల కనిపించినా వారు పెద్దగా రోడ్డుపై ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో లేరనే విమర్శలున్నాయి. పెరుగుతున్న క్రైమ్‌రేట్ దృష్ట్యా హైదరాబాద్ మరో బీహార్‌గా మారబోతుందా అనే చర్చ జరుగుతోంది. రోడ్లపై దుండగులు కత్తులతో స్వైరవిహారం చేస్తున్నారు. దారి దోపిడీలు పెరిగిపోతున్నాయి. బందోబస్తు, వరుస బదిలీలు, పని ఒత్తిడి వరుస కారణాలతో నిఘా లోపం ఏర్పడుతుందని పోలీసులు చెబుతున్నారు. గత ఎన్నికల తర్వాత ఆరుసార్లు బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులకు పాత నేరస్తులెవరు..ఏయే ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతాయో గుర్తించలేకపోతున్నారు.
పెరుగుతున్న క్రైమ్‌రేట్..
నగరంలో గతంతో పోలిస్తే క్రైమ్‌రేట్ విపరీతంగా పెరుగుతోంది. 20 నుంచి 30శాతం క్రైమ్‌రేట్ పెరిగినట్లు ఓ పోలీస్ అధికారి ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గరి నుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందనే విమర్శలు ఉన్నాయి. పట్టపగలు హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, స్ట్రీట్‌ఫైట్స్, హ్యుమన్ట్రాఫికింగ్..ఇలా నేరగాళ్లకు హైదరాబాద్ వేదికగా మారుతోందనేది పోలీసు రికార్డులే చెబుతున్నాయి.
సీవీ ఆనంద్ వచ్చిన తర్వాత కమిషనరేట్‌లోని పలు పోలీసు విభాగాల్లో కీలక మార్పులు తీసుకొనిరావడంతో పాటు సైబర్నేరాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు. సజ్జనార్ వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పులేం రాలేదు. ఒక అధికారి కమిషనర్‌గా పనిచేసే క్రమంలో ఆయనకు లోకల్‌గా ఉన్న పరిస్థితులు అన్నీ అవగాహనకు రావడానికి కొంత టైమ్ పడుతుంది. కానీ రేవంత్ సర్కార్ ఆ అధికారి ఇంకా సీటులో కుదురుకోకముందే బదిలీ చేయడం తర్వాత వచ్చిన అధికారిపై మరింత ఒత్తిడి పెంచుతుందని పోలీస్‌శాఖలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.
కమిషనర్ల బదిలీలతో అయోమయం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 నెలల్లో సిటీ పోలీస్ కమిషనరేట్‌కు నలుగురు కమిషనర్లను మార్చింది. బదిలీల్లో భాగంగా అప్పటి సీపీ సందీప్ శాండిల్యను బదిలీ చేసి ఆయన స్థానంలో శ్రీనివాసరెడ్డిని నియమించారు. గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించిన ప్రభుత్వం ఏడాది గడిచిందో లేదో ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆనంద్‌ను హోంశాఖ కార్యదర్శిగా నియమించారు. అంతకుముందు శ్రీనివాసరెడ్డిని 2023 డిసెంబర్లో హైదరాబాద్ సీపీగా నియమించిన ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో ఆయన స్థానంలో ఆనంద్‌ను నియమించింది.
శ్రీనివాస్‌రెడ్డి కంటే ముందు పనిచేసిన సందీప్‌శాండిల్యను సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ చేసి ఆయన స్థానంలో శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. రాచకొండ సీపీగా సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతిలను నియమించింది. ఈ మూడు కమిషనరేట్లు నాలుగు కమిషనరేట్లుగా మార్పు చెందడంతో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్సిటీలు ఏర్పడ్డాయి. ఇందులో సైబరాబాద్‌కు రమేశ్‌రెడ్డిని నియమించిన ప్రభుత్వం మల్కాజిగిరికి సీపీగా సుమతిని, ఫ్యూచర్‌సిటీకి తరుణ్జోషిని నియమించింది. ఈ నియామకంలో కూడా మల్కాజిగిరికి మొదలు సుధీర్‌బాబు, ఫ్యూచర్‌సిటీకి అవినాశ్ మహంతిని నియమించి రెండు మూడు నెలలకే మళ్లీ కొత్త నియామకాలు చేపట్టింది. శ్రీనివాస్‌రెడ్డిని నియమించిన తొమ్మిదినెలలకే ఆయనను మార్చి ఆ స్థానంలో సీవీ ఆనంద్‌ను నియమించారు. శ్రీనివాస్‌రెడ్డిని మార్చడానికి సిటీలో రెగ్యులర్‌గా గొడవలు జరుగుతున్నాయని, క్రైమ్‌రేట్ పెరగడమన్న సాకు చూపింది. అటు నుంచి కేవలం సంవత్సర కాలానికే సీవీఆనంద్ను మార్చి సీపీగా వీసీ సజ్జనార్‌ను నియమించడం, ఆనంద్‌కు హోంశాఖ సెక్రటరీగా నియమించారు.
గంజాయి బ్యాచ్‌లు.. అంతర్ర్రాష్ట్ర ముఠాలు..
ఈ రెండేళ్ల కాలంలో నగరంలో మత్తుపదార్థాల వినియోగం విపరీతంగా పెరిగింది. అర్ధరాత్రిళ్లు అడ్డగోలుగా మద్యం అమ్మకాలు, విచ్చలవిడిగా యువతకు గంజాయి, డ్రగ్స్ వంటివి నేరాలకు దారితీస్తున్నాయి. మాదకద్రవ్యాలపై మూడు కమిషనరేట్లలోని పోలీసులు ఉక్కుపాదం మోపినా ఏదో ఒకరూపంలో అవి చేరాల్సిన చోటకు చేరుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో టిజిన్యాబ్ పట్టుకున్న మాదకద్రవ్యాల కేసుల్లో అత్యధికం సిటీ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఒకవైపు నగరంలో అల్లరిమూకలు అలజడి సృష్టిస్తుంటే మరోవైపు నగర శివార్లలో అంతర్ర్రాష్ట్రముఠాలు బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన గ్యాంగులు, చైన్‌స్నాచర్లు నగరంలో చేరి తమ పంజా విసురుతున్నారు. పోలీసుల దెబ్బకు నగరంవైపు చూడని గ్యాంగులు ఇప్పుడు సిటీలో యథేచ్ఛగా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతోంది. ట్రై కమిషనరేట్స్ పరిధిలో జరుగుతున్న హత్యలు, దారిదోపిడీ ఘటనలు నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.