గ్రేటర్ పరిధిలోని పలు ఏరియా దవాఖానలో కొన్ని నెలలుగా సరైన మందుల సరఫరా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి క్వార్టర్లీ కోటా మందులను టీఎస్ఎంఐడీసీ సరఫరా చేస్తుంది. కొన్ని నెలలుగా కొన్ని రకాల మందులను మాత్రమే సరఫరా చేయడంతో ఇతర మందుల కొరత ఏర్పడుతుంది. ప్రతి మూడు నెలలకు రావాల్సిన క్వార్టర్లీ కోటాలో మందుల కోత కారణంగా అవసరమైన మందులను లోకల్ పర్చేజ్ చేసుకోమంటూ టీఎస్ఎంఐడీసీ సంబంధిత వైద్యాధికారులకు సూచించినట్లు సమాచారం.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ):రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత ఏరియా హాస్పిటల్స్‌కు చెందిన వైద్యాధికారులు లోకల్ పర్చేజ్ కింద మందులను కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. కొంత కాలంగా లోకల్ పర్చేజ్‌కు సైతం నిధులు విడుదల చేయకపోవడంతో మందుల కొరత తీవ్రమైనట్లు తెలుస్తోంది. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్‌లో సగం మందులే ఇస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. మిగతా మందులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే స్టాక్ లేదని, బయట కొనుక్కోమంటు అక్కడి సిబ్బంది చెబుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ఐదు రోజుల కోర్సు కింద మందులు రాస్తే దవాఖానలోని ఫార్మసీలలో కేవలం మూడు రోజులకు సరిపడా మందులు మాత్రమే ఇస్తున్నారని, మూడు రోజులకు సరిపడా మందులు రాస్తే రెండు రోజులకు సరిపడా మందులే ఇస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే మందులు మిగతా వారికి కూడా ఇవ్వాలి కదా, కొరత ఉన్నందున అలా ఇస్తున్నామంటూ ఫార్మసిస్టులు చెబుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని ఉన్నతాధికారులు..
మందుల కొరతకు సంబంధించి ఎన్ని ఎండెంట్లు పెట్టినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని అధికారులు వాపోతున్నారు. మూడు నెలల ముందే కావల్సిన మందులకు సంబంధించిన ఇండెంట్లు పెట్టినా ఫలితం లేదని నామమాత్రంగా కొన్ని మందులను సరఫరా చేసి, రోజువారీగా అవసరమైన కనీస మందులను సైతం సరిగ్గా ఇవ్వడం లేదని, దీని వల్ల రోగులు తమతో గొడవలకు దిగుతున్నట్లు దవాఖానల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.