అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
శాసనమండలిలో హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ద్రవ్య వినిమయ బిల్లు -2022కు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మంగళవారం ఆమోదం తెలిపాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బిల్లులను ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చించిన అనంతరం ఉభయసభలు ఆమోదించాయి. మండలిలో జరిగిన చర్చలో సభ్యులు అఫండీ, మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, జీవన్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, తాతా మధు, ఏ నర్సిరెడ్డి, శేరి సుభాశ్‌రెడ్డి, బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ద్రవ్య వినిమయ బిల్లులో ఓటెడ్ ఎక్స్పెండిచర్ (సభ ఆమోదం లేకుండా పెట్టే ఖర్చు) రూ.2,26,060 కోట్లు, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ (సభ ఆమోదం తప్పనిసరిగా పొందాల్సిన ఖర్చు) రూ.30,959 కోట్లు ఉన్నట్టు వివరించారు. పాడి రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ఇచ్చే ప్రోత్సాహకం నిధులను త్వరలోనే దశలవారీగా చెల్లిస్తామని తెలిపారు.
కరోనా సమయంలో వైద్యశాఖలో పనిచేసినవారికి ఉద్యోగాల భర్తీలో వెయిటేజ్ ఇస్తామని ప్రకటించారు. గాంధీ దవాఖానాలో నూతన క్యాథ్లాబ్ను త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గుండె శస్త్ర చికిత్సలకు అవసరమైన క్యాథ్‌ల్యాబ్‌లను హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌లో కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈహెచ్ఎస్పై ఉద్యోగ, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. కొద్దిమంది రాజకీయ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్లను రెచ్చగొట్టి, ఉద్యోగాలు పోయేలా చేశారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకొనేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అసంపూర్తిగా భవనాలు నిలిచిపోరాదనే ఉద్దేశంతోనే సీడీపీ నిధుల వినియోగంపై నిబంధనలు విధించినట్టు వివరించారు. గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం తెలంగాణలో కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు.
మంగళవారం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన అద్భుతమైన మానవీయ కోణాన్ని అవిష్కరిస్తున్నదని చెప్పారు. దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ బడుగుల బహుబలి అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే నాయకులు త్వరలో కనుమరుగవుతారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల ప్రకటన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా తన ఖాతాలో పడిందని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్థాయిలో నిరుద్యోగుల కోసం లైబ్రరీ, స్టడీ మెటీరియల్, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పుట్టడం గొప్ప కాదు.. తెలంగాణ కోసం పుట్టడమే గొప్ప అని సీఎం కేసీఆర్ నిరూపించారని ఎమ్మెల్సీ తాత మధు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా ఉన్నదని ప్రశంసించారు.
రాష్ట్రంలో ధర్నాలు అవసరం లేదు: ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
రాష్ట్రంలో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని, దరఖాస్తు చేసుకొంటే చాలు సమస్యలు పరిష్కారం అవుతాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ సకల జనుల సంక్షేమ బడ్జెట్ అని పేర్కొన్నారు.
ప్రశ్నోత్తరాలకు బదులు జీరో అవర్
మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే సభ్యుల కోరిక మేరకు స్పీకర్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, జీరో అవర్‌ను నిర్వహించారు. సభ్యులకు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలను మంత్రులు నోట్ చేసుకొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదని, పురపాలకశాఖ మంత్రి చొరవ తీసుకొని పరిష్కరించాలని బాల్క సుమన్ కోరారు. దీనిపై మంత్రి కే తారకరామారావు స్పందిస్తూ.. మీసా చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలను కోరతామని చెప్పారు. ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను ఒప్పించాలని సూచించారు. సభలో జీరో ఆవర్ ముగిసిన తరువాత అసెంబ్లీ వ్యవహారాలను పరిశీలించడానికి ఆస్ట్రియా పార్లమెంటరీ బృందం వచ్చిందని స్పీకర్ సభకు తెలిపారు.
రెండు బిల్లులకు మండలి ఆమోదం
ద్రవ్య వినిమమ బిల్లుతో మరో రెండు బిల్లులకు శాసనమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. వీటిలో ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు చట్ట సవరణ బిల్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితిని ఏడాది నుంచి రెండేండ్లకు, సభ్యుల సంఖ్యను 14 నుంచి 18కి పెంచెందేకు ఉద్దేశించిన మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు చట్ట సవరణ బిల్లును ఆర్థికమంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. చర్చలో కల్వకుంట్ల కవిత, వెంకట్రామ్రెడ్డి, గంగాధర్‌గౌడ్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటెడ్ ఎక్స్పెండిచర్ (సభ ఆమోదం లేకుండా పెట్టే ఖర్చు);రూ.2,26,060 కోట్లు
చార్జ్డ్ ఎక్స్పెండిచర్ (సభ ఆమోదం తప్పనిసరిగా పొందాల్సిన ఖర్చు) ;రూ.30,959 కోట్లు