హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): విద్యార్థులను సివిల్స్ వైపు మళ్లించేందుకు వందేండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక అడుగు వేసింది. సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటులో భాగంగా బుధవారం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సీ గణేశ్, కో ఆర్డినేటర్‌గా డాక్టర్ ఈ సుజాతను నియమించింది. అకాడమీ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని ఆదేశించింది. అకాడమీ ద్వారా వచ్చే జనవరి ఒకటి నుంచి ఓయూ విద్యార్థులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. సివిల్స్‌తోపాటు గ్రూప్ -1, గ్రూప్ -2 వంటి పలు రకాల పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నది. హైదరాబాద్ నుంచి ప్రతి ఏటా 49 వేల నుంచి 50 వేల మంది సివిల్స్ పరీక్షలకు పోటీపడుతున్నారు. వీరిలో అత్యధికులు ప్రైవేట్ సంస్థల్లోనే శిక్షణ పొందుతున్నారు. ఓయూ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కావడం, భారీ ఫీజులు చెల్లించే స్థోమత లేకపోవడంతో సివిల్స్ ఆశలను నెరవేర్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ద్వారా ఓయూ అధికారులు నాణ్యమైన శిక్షణ ఇవ్వనున్నారు. వర్సిటీలోని ఆచార్యుల చేత విద్యార్థులకు ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు, పరీక్షలు నిర్వహించి, విద్యార్థులు చేస్తున్న తప్పులను సరిదిద్దనున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో బోధన కొనసాగించేలా అకాడమీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఓయూ విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చేందుకు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ తెలిపారు. తెలంగాణలోని పేద విద్యార్థులు తమ సివిల్స్ కలను సాకారం చేసుకునేందుకు ఈ అకాడమీ దోహదపడుతుందని పేర్కొన్నారు.