హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : పెన్నా బేసిన్ నీటితో హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ ప్రాజెక్టులను నిర్వహించుకోలేమని, అందుకే కృష్ణా జలాలను తరలించుకుంటున్నామని ఏపీ సర్కార్ వెల్లడించింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్రం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి ఢిల్లీలో ఈ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ గురువారం సైతం కొనసాగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో క్యారీ ఓవర్ స్టోరేజీ నీటివినియోగం ఆధారంగానే తమకు 76%, తెలంగాణకు 24% నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఏపీ ప్రతిపాదించింది.
తెలంగాణ సైతం ఆర్డీఎస్ దగ్గర వాడుకోలేని నీళ్లను తుమ్మిళ్ల దగ్గర వాడుతున్నదని తెలిపింది. ఆర్డీఎస్ రైట్ కెనాల్‌కు కేడబ్ల్యూడీటీ-2 అనుమతులిచ్చిందని, తద్వారా తుంగభద్ర రైట్ బ్యాంక్ లోలెవెల్ కెనాల్ కింద కవర్ కాని ఏరియాలకు నీళ్లిస్తామని వెల్లడించింది. ఆర్డీఎస్ను కృష్ణా బోర్డే పర్యవేక్షిస్తున్నదని, కమిటీలు కూడా వేశారని, 16వ బోర్డు మీటింగ్ మినట్స్ రికార్డయ్యాయని పేర్కొన్నది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచాలని నిపుణుల కమిటీ చెప్పలేదని, కేవలం ఆ అంశాన్ని పరిశీలించమని మాత్రమే సూచించిందని తెలిపింది. ఈ వాదనలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి.