బెల్లంపల్లి, జూలై 23 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థిను లు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఉడకబెట్టిన బఠానీలను అల్పాహారంగా అందించారు. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే కడుపునొప్పి, వికారంతో 30 మంది విద్యార్థినులు వాం తులు చేసుకున్నారు.
వెంటనే సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కోలుకున్న కొందరిని గురుకులానికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం మరికొందరు వాం తులు చేసుకోగా వారిని కూడా దవాఖాన కు తరలించారు. కొందరికి గురుకుల పాఠశాలలోనే షంషీర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంట ర్ వైద్య సిబ్బంది వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురిని మంచిర్యాలలోని ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థినులను డీఎంహెచ్ వో నరేందర్ రాథోడ్, ప్రోగ్రామ్ అధికారి సుధాకర్ పరామర్శించారు.
అనంతరం పాఠశాలకు వెళ్లి ఆహార పదార్థాలను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వాసురామ్ ఆధ్వర్యంలో ఆహారపదార్థాలు, నీటి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. బీసీ గురుకుల పాఠశాలల ఆర్సీవో శ్రీధర్, డీసీవో శిరీష వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉడకని ఆహారం, పరిశుభ్రత లేని పరిసరాలతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, ఇందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.