AP News : ఉండవల్లిలో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగిన రాళ్లదాడిపై ఏపీ హోంమంత్రి (AP Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తీవ్రంగా స్పందించారు. అమరావతిలో అడుగుపెట్టే కనీస అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. వారు రైతులను పరామర్శించడానికి వెళ్లారా.. లేక రౌడీయిజం చేయడానికా అని ప్రశ్నించారు. వారి వెంట ఎంతమంది రౌడీషీటర్లు (Rowdy Sheeters) ఉన్నారో పోలీసుల వద్ద పక్కా లిస్ట్ ఉందని చెప్పారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారు కూడా వైసీపీ నేతల వెంట వచ్చారని, విజువల్స్‌లో అందరూ ఉన్నారని తెలిపారు.
వైసీపీ నేతలకు వ్యతిరేకంగా అక్కడ నిరసన తెలిపిన వారిలో 90 శాతం మంది రాజధాని కోసం భూములిచ్చిన అసలైన రైతులేనని హోంమంత్రి అనిత స్పష్టంచేశారు. వైసీపీ అధినేత జగన్ గతంలో అమరావతిని అంగీకరించి, ఆ తర్వాత మూడు రాజధానుల డ్రామాలతో ఐదేళ్లు నరకం చూపించారని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అమరావతి రైతుల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి పూర్తయితే వైసీపీకి మనుగడ ఉండదనే ఈ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతూ 2027 నాటికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకుందన్నారు.