హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మళ్లీ పావులు కదుపుతున్నది. పోలవరం నుంచే గోదావరి జలాల మళ్లింపును చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. అందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం తొలుత పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వరద జలాల పేరిట 200 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం-బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీకి, అక్కడి నుంచి పెన్నా బేసిన్‌కు మళ్లించే ప్రతిపాదనలతో రూ.80,112 కోట్లతో లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
అయితే కేంద్ర సంస్థలు, కోబేసిన్ రాష్ర్టాలు, ఏపీలోని మేధావులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో వెనుకడుగు వేసింది. ఆర్థిక భారం వల్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తున్నట్టు చెప్పి టెండర్లను రద్దు చేసింది. కానీ ఆ లింక్ ప్రాజెక్టులో పలు మార్పులు చేసింది. గోదావరి వరద జలాలను బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమల రిజర్వాయర్‌కు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈ ప్రణాళిక అమలుకు మొత్తంగా రూ.58 వేల కోట్లు అంచనా చేసింది. ఈ ప్రతిపాదనలకు సైతం అనేక కేంద్రసంస్థలు అభ్యంతరం తెలుపడంతో ఏపీ కాస్త నెమ్మదించింది. తాజాగా మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా వేగంగా పావులు కదుపుతున్నదని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
వరద జలాల మళ్లింపునకు నిధులు మంజూరు చేసే మార్గదర్శకాలేవీ కేంద్రం వద్ద లేవు. ట్రిబ్యునల్ ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును జీసీ (గోదావరి -కావేరి) ప్రాజెక్టులో భాగంగా చేపట్టాలని ఏపీ ప్రతిపాదించగా, అందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తున్నది. తొలుత గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి కృష్ణా బేసిన్‌కు, అక్కడినుంచి సోమశిల మీదుగా కావేరికి జలాలను తరలించాలనేది ప్రణాళిక. జీసీ లింకుపై తెలంగాణతోపాటు, అనేక రాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా జీసీ లింకు ముందుకుసాగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీ సైతం కొంతకాలంగా ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి జీసీ లింకును చేపట్టవచ్చని ప్రతిపాదిస్తున్నది. పోలవరం నుంచి జలాలను బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా బనకచర్లకు, ఆపై సోమశిలకు అక్కడి నుంచి కావేరికి మళ్లించవచ్చని ప్రతిపాదిస్తున్నది. తద్వారా జీసీ లింకు ఉద్దేశం నెరవేరడంతోపాటు, ఏపీ బనకచర్ల లింకు సైతం సాకారమవుతుంది. అదీగాక రివర్ లింకు ప్రాజెక్టులో భాగంగా చేపట్టడం మూలంగా నిధుల మంజూరుకు, అనుమతుల మంజూరుకు సైతం ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ఏపీ ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది.