Amaravati Iconic Bridge | ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నమూనా ఖరారైంది. ఇటీవల నాలుగు డిజైన్లను సీఆర్డీఏ వెబ్సైట్లో ఉంచి ఏపీ ప్రభుత్వం ఓటింగ్ పెట్టింది. వాటిలో రెండో ఆప్షన్‌కు దాదాపు 14 వేల వరకు ఓట్లు పడ్డాయి. సీఎం చంద్రబాబు కూడా ఆ నమూనాకే మొగ్గు చూపారు. దీంతో అదే డిజైన్‌ను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ నమూనాకు సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధమైంది.
అమరావతిలోని ఎన్13 రహదారిని 65వ జాతీయ రహదారితో అనుసంధానిస్తూ ఈ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్ 65 నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తుంది. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజీ మీదుగా రావాల్సి ఉంటుంది. ఈ మార్గం రద్దీ సమయాల్లో వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. అదే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మూలపాడు నుంచి కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమరావతిలోకి అడుపెట్టవచ్చు. అంటే దాదాపు 35 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లడానికి దాదాపు గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద వంతెన ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి విజయవాడ వైపు లేదా హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.