Vangalapudi Anitha | సోషల్మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సహించబోమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కల్పిత వీడియోల ద్వారా చాలామంది ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ఓ లారీపై రాళ్లు వేసిన వీడియోను.. ఏపీలో జరిగినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు పోలీసులకు అత్యాధునిక సాంకేతికతను అందజేస్తామని తెలిపారు.
తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ఇవాళ అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆఫీసును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందన్నారు. పోలీసులు వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారని అన్నారు. పోలీసులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. పోలీసులకు కోటి రూపాయల బీమా కూడా అందిస్తున్నామని అన్నారు. అదే వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగంకూడా ఇవ్వలేదని విమర్శించారు. పోలీసు చనిపోతే.. వారి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.