Are Shyamala | తనపై ఎన్ని కేసులు పెట్టినా, విచారణల పేరుతో ఎన్నిసార్లు తిప్పినా పోరాటం ఆపనని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల స్పష్టం చేశారు. కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధిగా పది ప్రశ్నలు అడిగానని, వాటిలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు టీడీపీ నాయకులు సమాధానం చెప్పకుండా కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు.
కర్నూలు బస్సు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో గత నెల 30వ తేదీన కర్నూలు తాలుకా అర్బన్ పోలీస్ స్టేషన్లో 27 మందిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఆరె శ్యామల సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు శ్యామల సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. గంటన్నరపాటు సాగిన ఈ విచారణలో.. ప్రమాదానికి ముందు శివశంకర్, అతని మిత్రుడు ఎర్రిస్వామి బెల్టు షాపులో మద్యం తాగారని ఎవరు చెప్పారు? దానికి తగిన ఆధారాలున్నాయా? ఉంటే చూపించాలంటూ పోలీసులు ప్రశ్నించారు. దీనికి ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో.. అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేశారని అడిగారు. వైసీపీ అధికార ప్రతినిధి కావడంతో పార్టీ ఆదేశాల మేరకు తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పినట్లు తెలిసింది. తన వ్యవహారం వెనుక పార్టీ ఉందని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో తన ప్రమేయం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఈ విచారణ అనంతరం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరె శ్యామల మాట్లాడారు. వైసీపీ అధికార ప్రతినిధిగా 10 ప్రశ్నలు అడిగానని.. వాటిలో తప్పేముందని ప్రశ్నించారు. విచారణల పేరుతో ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా.. ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటం మాత్రం ఆపనని స్పష్టం చేశారు.