Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. బస్సు ప్రమాదం గురించి తెలియగానే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రమాదానికి గురైన బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని అన్నారు. మృతుల కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సాయం అందజేస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని ముఖ్యమంత్రికి ఆయన వివరించారు. ఇక, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో బస్సుల్లో సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశారు.