చిలిపిచెడ్, అక్టోబర్ 24 : పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి అని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని శిలాంపల్లి గ్రామంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధిని నివారణ టీకాలను మండల పశువైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. 7వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 4 నెలల పైబడిన పశువులన్నీటికీ ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
గాలికుంటు వ్యాధి వైరస్ వలన పశువులకు సోకుతుంది. ఈ వ్యాధి పశువులకు సోకడం వల్ల పశువులలో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్ధ్యం తగ్గుతుందన్నారు. ఈవ్యాధి సంభవిస్తే పాడి రైతులకు ఆర్థికంగా ఎక్కువ నష్టం సంభవిస్తుందని, అందువల్ల నాలుగు నెలల వయసు దాటిన దూడలకు, పశువులకు ఏడాదికి రెండు సార్లు వ్యాధి నిరోధక టీకాలు కచ్చితంగ వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్టయ్య, యాదయ్య, శంకరయ్య, సతీష్, రైతులు పాల్గొన్నారు.