గత మూడు దశాబ్దాలుగా నేను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణిస్తున్నా. అయితే, భారత్ వెలుపల నేను ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదు, గత నెలలో కాప్ 30 సదస్సు కోసం బ్రెజిల్‌కు వెళ్లేంత వరకూ. అక్కడ ఒక సాధారణ వైరల్ ఫీవర్ నాకు భారత్, బ్రెజిల్ దేశాల్లో యాంటీబయోటిక్స్ వినియోగంలో ఉన్న వ్యత్యాసం కండ్లకు కట్టేలా చేసింది. భారత్‌లో అందరిలాగే నేను కూడా ఫ్యామిలీ డాక్టర్లపై ఆధారపడతాను. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు లాంటి అనారోగ్య సమస్యలకు సైతం నేను వారిని సంప్రదిస్తాను.
వారి సలహాలు, సూచనలు తీసుకుంటాను. వారి సలహా మేరకు ఔషధాలు తీసుకుంటాను. అయితే, ప్రతీసారి వారి సలహా మాత్రం ఒకేలా ఉంటుంది. నాకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతీసారి వైద్యుడిని సంప్రదిస్తే, వారి ప్రిస్క్రిప్షన్‌లో యాంటీ-అలర్జిక్, యాంటీబయాటిక్ మందులే ఉంటాయి. దానికి వారు చెప్పే కారణం ఒక్కటే, తర్వాతి దశలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకేనని. వైరస్ల మీద యాంటీబయాటిక్స్ పనిచేయవని తెలిసినా వారి చికిత్స కొనసాగుతుంది. నివారణ అనేది అన్నింటికి ముసుగుగా మారిపోయింది. అయితే, కొన్నేండ్ల క్రితం ఈ విధానం బెడిసికొట్టింది. ఒకసారి యాంటీబయాటిక్స్ వాడగా తీవ్రమైన దగ్గు వచ్చింది. అది నెలలపాటు పట్టిపీడించింది. అప్పటినుంచి యాంటీబయాటిక్స్ విషయంలో అప్రమత్తంగా ఉంటున్నా.
అయితే, బ్రెజిల్లో నాలుగో రోజు నా ఆరోగ్యం పాడైంది. వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి సోకిందనేది కచ్చితంగా చెప్పలేను. ఆవిరి పీల్చడం, ఉప్పునీటిని పుక్కిలించడం, వేడి నీళ్లు తాగడం, ప్యారాసిటమాల్ వాడటం లాంటివన్నీ చేశాను. అయినా, ఆరో రోజుకు జ్వరం, దగ్గు ఎక్కువయ్యాయి. దాంతో నేను మా డాక్టర్‌ను సంప్రదించాను.
నేను ఊహించినట్టుగానే ఆయన ప్యారాసిటమాల్, యాంటీ అలర్జిక్, యాంటీబయాటిక్, గొంతునొప్పిని తగ్గించే మందులు, విటమిన్, దగ్గు ఔషధాలను సూచించారు. నేను ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్‌కు వెళ్లాను. అక్కడ జరిగిన ఘటన నా కండ్లు తెరిపించింది. మొదట, ఆ ప్రిస్క్రిప్షన్‌ను వారు తిరస్కరించారు. బ్రెజిల్ చట్టాల ప్రకారం స్థానిక వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉండాలి. రెండు, ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయించే లోజెంజెస్, విటమిన్లు, ప్యారాసిటమాల్ లాంటి ఔషధాలను వేరుచేసి, యాంటీబయాటిక్స్‌ను మాత్రం విక్రయించలేమని స్పష్టం చేశాడు. మూడు, ప్రభుత్వ వైద్యుడిని సంప్రదించాలని సూచించాడు. దాంతో నేను అక్కడికి వెళ్లాను. ఆ దవాఖాన అత్యంత శుభ్రంగా ఉంది. అయితే, అక్కడి సిబ్బంది పోర్చుగీస్‌లో మాట్లాడుతున్నారు. నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు.
ఈ భాషా అంతరాన్ని ఒక ట్రాన్స్లేషన్ యాప్ పూడ్చింది. భారతీయ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను బ్రెజిల్ వైద్యుడికి చూపించా. దాన్ని ఆయన పక్కనపెట్టేశారు. ‘మీకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకింది. 10-12 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది’ అని చెప్పారు. ఆయన రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ కూడా చాలా సాధారణంగా ఉంది. జ్వరం ఎక్కువైతే ప్యారాసిటమాల్, గొంతునొప్పికి సప్పరించే గోలీలు, ముక్కుదిబ్బడ తగ్గేందుకు నాజల్ రిన్స్ ఇచ్చారు. యాంటీ బయాటిక్స్, యాంటీ అలర్జిక్ ఇవ్వలేదు. నా కఫం పసుపు-ఆకుపచ్చ రంగులో మారిందని చెప్పగానే ఆయన నవ్వారు (దీన్ని భారత్‌లో కొందరు వైద్యులు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కు సంకేతంగా భావిస్తారు). అది ఒక అపోహ మాత్రమేనని, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కఫం ఇలాంటి రంగులో కనిపిస్తుందని ఆయన వివరించారు. అంటే, జలుబు, దగ్గుకు సంబంధించి భారత వైద్యులు చెప్పిన అనేక విషయాలను ఆయన ఖండించినట్టే.
నేను స్వల్ప లక్షణాలతోనే భారత్‌కు తిరిగి వచ్చాను. కుతూహలంతో కఫం పరీక్ష చేయించుకున్నాను. కొంత బ్యాక్టీరియా పెరుగుదల ఉందని నివేదిక వచ్చింది. మా డాక్టర్ వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలన్నారు. అయితే బ్రెజిల్ డాక్టర్ మాత్రం యాంటీబయాటిక్స్ అవసరం లేదని, బ్యాక్టీరియా సహజంగానే తగ్గిపోతుందని చెప్పారు. ఈసారి నేను బ్రెజిల్ డాక్టర్ మాటలనే నమ్మాను. మొత్తానికి 13 రోజులకు ఒక్క యాంటీబయాటిక్ గాని, యాంటీ అలర్జిక్ గాని వాడకుండానే పూర్తిగా కోలుకున్నాను.భారతీయ వైద్యులను విమర్శించడానికి ఇదంతా చెప్పడం లేదు. వ్యవస్థాగత వైఫల్యాన్ని ఎత్తిచూపించేందుకే చెప్తున్నాను. ప్రపంచంలోని చాలా దేశాల్లో యాంటీబయాటిక్స్‌ను నిజంగా అవసరమైనప్పుడు చికిత్సా ఔషధాలుగా వాడతారు. కానీ, భారత్‌లో మాత్రం ముందస్తు నివారణ కోసం వినియోగిస్తున్నారు. మన దేశంలో మానవ శరీరం సహజంగా ఎదుర్కోగల వైరల్ ఇన్ఫెక్షన్లకూ యాంటీబయాటిక్స్‌ను సూచిస్తున్నారు.
ఈ దుర్వినియోగం, అతివినియోగమే భారతదేశం నేడు ప్రపంచ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సంక్షోభానికి కేంద్రబిందువుగా మారడానికి ప్రధాన కారణమైంది. భారత్‌లో ఏఎంఆర్ కారణంగా ఏటా సుమారు 3 లక్షల మరణాలు సంభవిస్తున్నట్టు అంచనాలున్నాయి. ఐసీఎంఆర్ ప్రకారం సిప్రోఫ్లొక్సాసిన్, అమోక్సిసిలిన్, అజిథ్రోమైసిన్ వంటి సాధారణ యాంటీబయాటిక్స్‌కు ఇప్పటికే ప్రతిఘటన ఎదురవుతున్నది. న్యుమోనియా, బ్లడ్స్ట్రీమ్, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల విషయంలో 40-70 శాతం ఏఎంఆర్ నమోదవుతున్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఇది కేవలం దుర్వినియోగం వల్లే కాదు, భారత్‌లో ఆహార సరఫరా వ్యవస్థలోనూ విచక్షణ లేకుండా యాంటీబయాటిక్స్‌ను ప్రవేశపెట్టడం వల్ల జరుగుతున్నది. కోళ్లు త్వరగా బరువు పెరిగేందుకు, పాల ఉత్పత్తి పెరిగేందుకు వీటిని ‘గ్రోత్ ప్రమోటర్స్’గా వాడుతున్నారు. ఈ విధంగా ఏర్పడిన రెసిస్టెంట్ బ్యాక్టీరియా మన శరీరాల్లోకి చేరుతున్నది. ఫలితంగా మనందరం రెసిస్టెంట్ బ్యాక్టీరియా నిల్వలుగా మారిపోతున్నాం. వాస్తవానికి యాంటీబయాటిక్స్ అవసరమైన ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిన రోజున పనిచేసే మందులే మన వద్ద ఉండకుండా పోవచ్చు.
201617లలో భారత ప్రభుత్వం ‘జాతీయ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ చర్య ప్రణాళిక’ నివేదికను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేను ఆ కమిటీ సభ్యుడిని కూడా. మేం నివేదికను సమర్పించాం. కానీ, అది కాగితాలకే పరిమితమైంది. భారత్‌కు, బ్రెజిల్ వంటి దేశాలకు మధ్య ఉన్న అసలైన తేడా వైద్య నైపుణ్యంలో కాదు, విధానాలను కఠినంగా అమలు చేయడంలో ఉన్నది. అవసరం లేనంతవరకు యాంటీబయాటిక్స్‌ను సూచించకపోవడం, విక్రయించకపోవడమే ఈ సమస్యకు పరిష్కార మార్గం. బ్రెజిల్ డాక్టర్ చెప్పినట్టుగా భయంతో కాదు, అవసరం ఉన్నప్పుడే యాంటీబయాటిక్స్‌ను వాడాలి. ఏఎంఆర్ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే భారత్‌కు కూడా బ్రెజిల్ వలె వైద్య క్రమశిక్షణ, కఠినమైన విధానాల అమలు అవసరం.
(వ్యాసకర్త: సీఈవో, ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ ఎన్విరాన్మెంట్, సస్టెయినబిలిటీ అండ్ టెక్నాలజీ- ఐఫారెస్ట్) (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో..)
-చంద్ర భూషణ్