సిరిసిల్ల రూరల్ : ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌నకు (Online betting App) మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో అప్పులు చేసి మోస పోయి ఉరివేసుకుని ఆత్మహత్య ( Suicide) చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ( Siricilla ) తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (25) కరీంనగర్ వీల్ ఆలైన్మెంట్ మెకానిక్ వర్క్ చేస్తున్నాడు.
ఈక్రమంలో బెట్టింగ్ మోజులో పడి మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ బెట్టింగ్ పెడుతూ స్నేహితులు, బంధువుల నుంచి రూ.10లక్షల వరకు అప్పులు చేసి పోగొట్టుకున్నాడు. దీంతో బెట్టింగ్ యాప్‌లో నష్టం రావడంతో ఆందోళన కు గురయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు మందలించారు. సోమవారం గ్రామ శివారులోని పొలం ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామ్మోహన్ తెలిపారు.